సామాన్యుడిలా ఆస్పత్రి సందర్శన
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:04 AM
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ మంగళవారం మధ్యాహ్నం సామాన్య వ్యక్తిలా నక్కపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ఓపీ కౌంటర్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లారు. తనకు దగ్గు, జలుబు ఉందని చెప్పి ప్రిస్ర్కిప్షన్ రాయించుకుని మందులు ఇచ్చే గది వద్దకు వెళ్లారు. మందులు తీసుకున్నారు.
నక్కపల్లి సీహెచ్‌సీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ
ఓపీ కౌంటర్‌లో పేరు నమోదు
మందులు తీసుకున్న తరువాత అసలు విషయం వెల్లడి
ఉలిక్కిపడిన వైద్యులు, సిబ్బంది
నక్కపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ మంగళవారం మధ్యాహ్నం సామాన్య వ్యక్తిలా నక్కపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ఓపీ కౌంటర్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లారు. తనకు దగ్గు, జలుబు ఉందని చెప్పి ప్రిస్ర్కిప్షన్ రాయించుకుని మందులు ఇచ్చే గది వద్దకు వెళ్లారు. మందులు తీసుకున్నారు. తన పరిశీలన అనంతరం అసలు విషయం చెప్పారు. వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అసలు విషయం చెప్పేసరికి ఆస్పత్రి వైద్యాధికారులు సహా సిబ్బందంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఆస్పత్రిలో జనర ల్, గైనిక్ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. భోజనం, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. వాష్‌రూమ్స్ పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ సహా జిల్లా ఆస్పత్రుల్లో ఖాళీగా వున్న వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టులను వచ్చే జనవరి నెలాఖరునాటికి భర్తీ చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవి కిరణ్, వైద్యాధికారులు అనూష, ఇషాక్, రవి కిరణ్, ఈశ్వర ప్రసాద్, తదితరులు వున్నారు.