గత్తరగుడ కాఫీ తోటల సందర్శన
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:58 AM
గత్తరగుడ కాఫీ తోటల సందర్శన
బెర్రీ బోరర్ పురుగును పరిశీలించిన
అనకాపల్లి, చింతపల్లి శాస్త్రవేత్తల బృందం
పురుగు నివారణపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన
రైతులకు 50 కిలోల బవేరియా బాసియానా,
50 ట్రాప్స్ పంపిణీ
అరకులోయ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాఫీ తోటలకు ఆశించిన బెర్రీ బోరర్ పురుగు నివారణ చర్యల్లో భాగంగా శనివారం అనకాపల్లి, చింతపల్లి ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం, జిల్లా హార్టీకల్చర్, కాఫీ బోర్డు అధికారులు మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ గత్తరగుడ కాఫీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బెర్రీ బోరర్ పురుగు నివారణకు తీసుకోవలసిన చర్యలను గిరి రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పురుగు వ్యాప్తి చెందకుండా బవేరియా బాసియానా మందును 50 కిలోలు రైతులకు అందజేశారు. ఈ మందు కాఫీ మొక్కలు మొదలు, చివరపైనా పిచికారీ చేయాలని సూచించారు. అదేవిధంగా తోటల్లో బెర్రీ బోరర్ పురుగు నివారణకు కాఫీ మొక్కల చివరపై ట్రాపర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం 50 ట్రాపర్‌లను రైతులకు అందజేశారు. ఇలా ఒకవైపు బవేరియా బాసియానా మందును కాఫీ తోటలంతా పిచికారీ చేయడం, మరోవైపు కాఫీ మొక్కలపై ట్రాపర్స్ ఏర్పాటు చేస్తే ఈ పురుగు పూర్తిస్థాయిలో నివారణ అవుతుందని శాస్త్రవేత్తలు, ఉద్యానవనాల శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు డెమో చేసి చూపించారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.ఎం.విజయలక్ష్మి, డాక్టర్ ఆర్.సరిత, డాక్టర్ ఎన్.భారతి, ఉద్యానవన శాఖ అధికారి బాలకర్ణ, ఐటీడీఏ పీహెచ్‌ఓ రాజశేఖర్, ఐటీడీఏ కాఫీ ఏడీ బొంజిబాబు, హార్టీకల్చర్ ఆఫీసరు కె.శిరీషా, హెచ్‌సీ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.