క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:15 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు.
అధికారులకు జేసీ ఎం.జాహ్నవి ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌ఓ సత్యనారాయణరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన అర్జీల గురించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి వాటి వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలన్నారు. అర్జీల్లో పేర్కొన్న సమస్య పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. కాగా పీజీఆర్‌ఎస్‌లో 313 అర్జీలు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురి నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీలను అందజేసిన వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించి న్యాయపరంగా వాటి పరిష్కారానికి దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు అందినట్టు జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు తెలిపారు.