అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విజన్-2047
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:12 AM
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విజన్-2047కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
అనువైన ప్రదేశంలో కేంద్రం ఏర్పాటు
సదుపాయాలకు రూ.10 లక్షలు కేటాయింపు
క్షేత్రస్థాయి సమాచారంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక
చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యే, కన్వీనర్‌గా ప్రత్యేకాధికారి
ఒక్కో కేంద్రానికి ఐదుగురు చొప్పున సచివాలయాల సిబ్బంది నియామకం
వచ్చే నెల రెండో తేదీ నుంచి విజన్ కేంద్రాల్లో సేవలు
నక్కపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విజన్-2047కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక విజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన ప్రాంతంలో అనువైన సచివాలయ భవనం లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజన్ కేంద్రంలో సదుపాయాల కల్పన, కంప్యూటర్లు, ఏసీ పరికరాలు, ఫర్నీచర్ కోసం ప్రభుత్వం సుమారు రూ.10 లక్షలు కేటాయిస్తుంది.. విజన్ సెంటర్‌ను పర్యవేక్షించి, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపేందుకు యంగ్ ప్రొఫెషనర్లను ఇతర ప్రాంతాలకు చెందిన వారిని నియమించారు.
పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయం పైఅంతస్థులో విజన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. యంగ్ ప్రొఫెషనర్‌గా బాపట్లకు చెందిన అధికారిని నియమించారు. విజన్ సెంటర్‌కు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నియోజకవర్గం ప్రత్యేకాధికారి కన్వీనర్‌గా, ఎంపీడీవో కో-కన్వీనర్‌గా వుంటారు. నియోజకవర్గంలోని ప్రజల స్థితిగతులు, సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి ఎంపిక చేసిన ఐదురుగు సచివాలయ సిబ్బందిని నియమించారు. ఈ నెలాఖరునాటికి పనులన్నీ పూర్తిచేసి అక్టోబరు 2వ తేదీ నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజన్ సెంటర్ల సేవలన అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పది సూత్రాలను నూరుశాతం అమలు చేయడమే లక్ష్యంగా విజన్-2047 కేంద్రాలు పనిచేస్తాయి. వీటిల్లో పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి అవకాశాలు, మానవనరుల వినియోగం -శిక్షణ, నీటి సంరక్షణ, వ్యవసాయంలో సాంకేతిక వినియోగం, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్‌ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్- ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంశాల అమలు, వాస్తవ పరిస్థితిపై విజన్ సెంటర్లు నడిచేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఎంపికైన సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు.
వేగవంతంగా విజన్ సెంటర్ పనులు
డి.సీతారామరాజు, ఎంపీడీవో, నక్కపల్లి
మండల పరిషత్ కార్యాలయంలో విజన్-2047 కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, పది సూత్రాలకు సంబంధించి నాలుగు మండలాల నుంచి సమాచారం, వాస్తవ పరిస్థితిని ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. విజన్ కేంద్రానికి అవసరమైన సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ కేంద్రం వల్ల ప్రజలకు పలు రకాలుగా మేలు జరుగుతుంది.