విశాఖ-విజయవాడ విమానాలు నేడు రద్దు
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:36 AM
హాల్ట్ లేని స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి తుఫాన్ బాధితులకు రైల్వే అధికారులు తమ వంతు సహకారం అందించారు.
మిగిలినవి యధాతథం: ఇండిగో
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య నడిచే విమానాలను బుధవారం రద్దు చేసినట్టు విమానాశ్రయం అధికారులు మంగళవారం ప్రకటించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం మొత్తం విమానాలన్నీ నిలిపివేశారు. సుమారుగా 56 సర్వీసులు రద్దయ్యాయి. అయితే బుధవారం ఉదయం నాటికి తుఫాన్ ప్రభావం తగ్గుతుందని భావించి యథాప్రకారం అన్ని సర్వీసులు నడపడానికి ఇండిగో సంస్థ ముందుకువచ్చింది. విజయవాడ-విశాఖపట్నం మధ్య మాత్రం విమానం నడపడం లేదని తెలిపారు. ఆ మార్గంలో ఇబ్బందులు ఉన్నందున, దానిని మినహాయించి మిగిలిన మార్గాల్లో విమానాలు నడపనున్నట్టు వివరించారు.
తుఫాన్ నేపథ్యంలో వందే భారత్‌కు
దువ్వాడలో హాల్ట్
ప్రయాణికుల విన్నపాన్ని మన్నించిన వాల్తేరు డివిజన్ అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):
హాల్ట్ లేని స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి తుఫాన్ బాధితులకు రైల్వే అధికారులు తమ వంతు సహకారం అందించారు. ఈ విషయంలో వాల్తేరు డివిజన్ సకాలంలో స్పందించింది. మొంథా తుఫాన్ నేపథ్యంలో విశాఖ మీదుగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు వైళ్లే రైళ్లు సుమారు 60 వరకు మంగళవారం రద్దు చేశారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ రైళ్లను మాత్రమే నడిపారు. ఈ రైలు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 5.05 గంటలకు బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉంది. ప్రయాణికుల్లో చాలా మంది అనకాపల్లి, స్టీల్‌ప్లాంటు, ఫార్మాసిటీ ప్రాంతాలకు చెందిన వారున్నారు. వందేభారత్ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు. చాలా తక్కువ స్టాపులు. సామర్లకోట స్టాప్ తరువాత నేరుగా వచ్చి విశాఖపట్నంలోనే ఆగుతుంది. అయితే వర్షాలు అధికంగా కురుస్తున్న తరుణంలో తామంతా విశాఖ వెళ్లి అక్కడి నుంచి కార్లు, ఆటోలు పట్టుకొని దువ్వాడ, అనకాపల్లి తదితర ప్రాంతాలకు వెనక్కి రావాలంటే ఇబ్బంది అవుతుందని, తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఈ రైలును ఆపాలని ప్రయాణికుల్లో కొందరు రైల్వే యాప్‌లో రిక్వెస్ట్ చేశారు. మరికొందరు అనకాపల్లి ఎంపీకి, విశాఖ ఎంపీకి సమాచారం ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ కూడా తన వంతు ప్రయత్నంగా వాల్తేరు డీఆర్‌ఎంకు ప్రయాణికుల విన్నపాన్ని చేరవేసింది. హైదరాబాద్ నుంచి అనకాపల్లి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి. అక్కడి అధికారులు విన్నపాన్ని పట్టించుకోలేదు. వాల్తేరు డివిజన్ అధికారులు మాత్రం ఈస్ట్ కోస్ట్ జోన్ అధికారులతో సంప్రతించి దువ్వాడలో రైలు ఆపడానికి అనుమతి తీసుకున్నారు. ఇదే విషయాన్ని రైలులోని మైకులో ప్రయాణికులకు వినిపించారు. దాంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు దువ్వాడలో రైలు ఆగగానే సుమారు 100 మంది వరకు అక్కడ దిగారు. తమ విన్నపాన్ని మన్నించినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వందే భారత్ ఇలా హాల్ట్ లేని స్టేషన్‌లో ఆగడం డివిజన్‌లో ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.