విశాఖల సింగపూర్ తరహా పర్యాటక అభివృద్ధి
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:24 AM
విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి సింగపూర్ తరహా చర్యలు చేపట్టనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన వ్యూహాలు, నమూనాల కోసం ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సెంతోశా ఐల్యాండ్‌ను మంగళవారం సందర్శించారు.
సెంతోశా ఐల్యాండ్‌ను సందర్శించి అభివృద్ధి, నిర్వహణకు వారు అనుసరిస్తున్న విధానాలపై చర్చ
సస్టెయినబుల్ టూరిజం విధానాలు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ వంటివి పరిశీలన
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి సింగపూర్ తరహా చర్యలు చేపట్టనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన వ్యూహాలు, నమూనాల కోసం ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సెంతోశా ఐల్యాండ్‌ను మంగళవారం సందర్శించారు. అక్కడి బీచ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు, ఆధునిక వసతులు పరిశీలించారు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్న సెంతోశా ఐల్యాండ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వారు అనుసరిస్తున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఉత్సవాల నిర్వహణ, పర్యాటకులను ఆకర్షించే అంశాలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై వారితో చర్చించారు. విశాఖలో పర్యాటక అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వినియోగించుకోవచ్చునో వారిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సస్టెయినబుల్ టూరిజం విధానాలు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ వంటివి పరిశీలించారు. విశాఖపట్నంలో ఆర్‌కే బీచ్, కైలాసగిరి వంటి పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన పర్యావరణ అంశాలపై చర్చించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ల నిర్వహణకు అనుగుణంగా విశాఖపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచనలు పంచుకున్నారు. ఈ పర్యటన విశాఖ పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.