Share News

ముంబైకు దీటుగా విశాఖ అభివృద్ధి

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:25 AM

ప్రకృతి వనరులకు ఆలవాలమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

ముంబైకు దీటుగా విశాఖ అభివృద్ధి

  • భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పరుగులు పెట్టిస్తున్నాం

  • టీసీఎస్‌ వచ్చింది, గూగుల్‌ డేటా సెంటర్‌ కూడా వస్తుంది

  • సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటుచేయబోతున్నాం

  • అనకాపల్లి జిల్లాలో మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటు, ఫార్మా పరిశ్రమలు

  • సింగపూర్‌ నుంచి విశాఖకు సముద్ర మార్గంలో కేబుల్‌

  • రాష్ట్రమంతా ఒక ఎత్తైతే..విశాఖ మరో ఎత్తు

  • ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటా

  • ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

  • ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో భాగస్వాములు కావాలని పిలుపు

విశాఖపట్నం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి):

ప్రకృతి వనరులకు ఆలవాలమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నగరాన్ని ముంబైకు దీటుగా అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రణాళికలు తయారుచేశామన్నారు. సోమవారం సాయంత్రం పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశాఖ ప్రజలకు తాను రుణపడి ఉంటానని, విశాఖకు ఎంత చేసినా తక్కువేనన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న నగరం విశాఖ అని గుర్తుచేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పరుగులు పెట్టిస్తున్నామన్నారు. విశాఖ బ్రాండ్‌ను పెంచగలిగితే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనివల్ల విమానాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి మన పిల్లలు చేరుకుంటారన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే...విశాఖ మరో ఎత్తన్నారు. భవిష్యత్తులో విశాఖకు మెట్రో రైలు వస్తుందని పేర్కొన్నారు. గతంలో తాను మెట్రోకు సంబంధించిన ప్రతిపాదనలను పెడితే...ఐదేళ్లు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. విశాఖకు ఇప్పటికే టీసీఎస్‌ వచ్చిందని, త్వరలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతుందన్నారు. ప్రపంచంలోని డేటాను విశాఖకు తెచ్చి ఏఐ సాయంతో విశ్లేషించనున్నట్టు తెలిపారు. ఇందుకు సింగపూర్‌ నుంచి విశాఖకు సముద్ర మార్గంలో కేబుల్‌ వేయనున్నట్టు చంద్రబాబునాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంటు వస్తోందని, అది ఏర్పాటైతే అక్కడ స్టీల్‌ సిటీ ఏర్పాటవుతుందన్నారు.

ప్రభుత్వ భూముల తాకట్టు..

గత వైసీపీ పాలకులు విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు, కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలను తాకట్టు పెట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి రెండేళ్లకు రావాల్సిన డబ్బులను ముందుగానే డ్రా చేశారన్నారు. విశాఖలో భారీఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని, వైసీపీ పాలకులకు ఇష్టం లేని భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. అయితే, తాము అధికారంలోకి వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని, భూములు జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు చేపట్టామన్నారు. భూమి రికార్డుల్లో మార్పులు చేయకుండా బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో వాటిని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

విశాఖ కేంద్రంగా ఎకనామిక్‌ హబ్‌..

విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎకనామిక్‌ హబ్‌ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు రిపోర్ట్‌ తయారైందన్నారు. కాకినాడ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకూ గల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బెస్ట్‌ ఎకమినామిక్‌ కారిడార్‌గా నిలుస్తుందన్నారు.

యోగాలో భాగస్వాములు కావాలి..

ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖను ప్రపంచపటంలో పెట్టే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ మ్యాట్‌, టీ షర్ట్‌ ఇస్తామన్నారు. ప్రతిరోజూ ఇంటి వద్ద యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చునన్నారు. 45 నిమిషాలపాటు ఎంతమంది యోగా చేస్తారో చేతులు ఎత్తాలని చంద్రబాబు చెప్పగా.. అందరూ చేతులెత్తేశారు. దీనికి ఆయన నవ్వుతూ...తనపై ఒట్టేసి చెప్పాలని కోరడంతో అందరూ నవ్వుకున్నారు.

గుంత కనిపిస్తే మేయర్‌ పదవి గోవిందా.?

నగర పరిధిలో రోడ్లు బాగుండాలని, ఎక్కడా గుంత కనిపించకూడదని చంద్రబాబునాయుడు అన్నారు. గుంత కనిపిస్తే మేయర్‌ పదవి గోవిందా అంటూ పీలా శ్రీనివాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు అంతా నవ్వారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు లేచి ఎయిర్‌పోర్టులో మీపై దాడి జరిగిన వ్యవహారంపై దృష్టిసారించాలని కోరగా..తన దృష్టిలో ఉందని చంద్రబాబునాయుడు సమాధాన మిచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన కొడాలి నాని, పేర్ని నానిలను అరెస్టు చేయాలని కొందరు, జగన్‌ను అరెస్ట్‌ చేయాలని మరికొందరు నినాదాలు చేశారు.

మనది కుటుంబ అనుబంధం..

పార్టీ కార్యకర్తలంతా తనకు ప్రాణ సమానులైన కుటుంబ సభ్యులని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమావేశానికి ఐదారు గంటలు ఆలస్యమైనా కార్యకర్తల ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే పుట్టాలనిపిస్తోందన్నారు. ‘మనది రాజకీయ అనుబంధం కాదు. కుటుంబ అనుబంధం’ అని పేర్కొన్నారు. ‘45 ఏళ్లుగా చూస్తున్నా. నాతోపాటు మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. కరెక్ట్‌గా ప్లాన్‌ చేస్తే వేరే వాడు ఎవడూ ఏమీ చేయలేడు’ అన్నారు. టీడీపీ కార్యకర్తలు పవర్‌ ఫుల్‌ అని, మీరు రోడ్డు మీదకు వస్తే ఎవడూ నిలబడలేరన్నారు. కార్యకర్తలకు అప్పుడప్పుడు అలక వస్తుందని, అటువంటిప్పుడు కాడె పడేస్తారన్నారు. అయితే, ఎక్కడికీ వెళ్లరని, ఏ జెండా పట్టుకోరని, ఎవరికి ఓటు వేయరని పేర్కొన్నారు. కానీ, ఆ ఆలకే ప్రమాదమన్నారు. అందుకే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, పార్టీ కార్యకర్తకు భవిష్యత్తులో అలక రాకుండా చేయడమే లక్ష్యమన్నారు. అందుకే ఇటీవల రెండు గంటలు ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేస్తే...మరో రెండు గంటలు కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తల కోసం వెచ్చిస్తున్నానన్నారు. ఈ సమయం కొండనైనా బద్ధలు చేసే టానిక్‌గా పనిచేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల పాత జిల్లాలోని అందరినీ చూడగలుగుతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మనం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, దీన్ని తన మాటగా ప్రజలకు చెప్పాలన్నారు. పార్టీ కోసం సైనికుల మాదిరిగా పనిచేశారని, పార్టీ కూడా కార్యకర్తల గౌరవాన్ని కాపాడేలా చూసుకుంటుందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ మంచివాళ్లు ఎక్కువగా ఉంటారన్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టీడీపీకి కంచుకోటన్నారు. హుద్‌హుద్‌ తరువాత ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగురలేదన్నారు.

స్టీల్‌ప్లాంటును కాపాడిన ఘనత ఎన్‌డీఏదే..

కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అప్పుడు, ఇప్పుడూ కాపాడిందీ ఎన్‌డీఏ భాగస్వామ్య ప్రభుత్వమేనని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. వాజపేయి హయాంలో ఒకసారి స్టీల్‌ప్లాంటును నష్టాల్లో నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు మరోసారి రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇప్పించడం ద్వారా ప్లాంటును పరిరక్షించామన్నారు. ప్లాంటుపై కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినప్పుడు నీళ్లు, విద్యుత్‌, భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చామన్నారు. తద్వారా కర్మాగారాన్ని కొనసాగించేలా చేసుకోగలిగామన్నారు. త్వరలో స్లర్రీ ద్వారా ముడి ఇనుము తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనివల్ల పరిశ్రమపై భారం తగ్గి లాభాల బాటలో పయనించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనికి విశాఖపట్నంపై తనకు ఉన్న అభిమానమే కారణమన్నారు. ఉద్యోగులు ప్లాంటును శాశ్వతంగా రక్షించుకునేందుకు లాభాల బాటలో పయనించేలా చేయాలన్నారు. స్టీల్‌ప్లాంటు 20 వేల ఎకరాల్లో ఉందని, ఎకరా ఆరు కోట్లు చొప్పున చూసినా లక్ష కోట్లకుపైగా ఆస్తి ఉందన్నారు. దీన్ని కాపాడుకుని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. గత ప్రభుత్వం విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు భూమి అడిగితే ఇవ్వలేదని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అయితే, అభివృద్ధి విషయంలో తాము ఎక్కడా రాజీ పడకుండా భూమిని కేటాయించామన్నారు. ఎన్‌టీపీసీ అనకాపల్లి జిల్లాలో లక్షా 85 వేల కోట్లు రూపాయలతో గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ఉత్పత్తిచేసే ప్లాంటు ఏర్పాటుకు చర్యలు శ్రీకారం చుట్టిందని, నక్కపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మూడు, నాలుగు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. వాటివల్ల పెద్దఎత్తున స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 01:25 AM