Share News

భారీఎత్తున విశాఖ ఉత్సవ్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:50 AM

విశాఖ ఉత్సవ్‌ను ఈసారి భారీఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భారీఎత్తున విశాఖ ఉత్సవ్‌

భీమిలి, అరకు ఉత్సవ్‌లు కూడా కలిపి నిర్వహణ

కనీసం ఐదు రోజులు, గరిష్ఠంగా వారం నిర్వహించేందుకు యోచన

ప్రపంచ రికార్డు సాధించేలా ఏర్పాట్లు

భారీ క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటు?

విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌ను ఈసారి భారీఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ నెలాఖరున 29, 30 తేదీల్లో నిర్వహించాలని తలపెట్టిన భీమిలి ఉత్సవ్‌ను, జనవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించాలనుకున్న అరకు ఉత్సవ్‌ను రద్దు చేసింది. ఇవన్నీ కలిపి ఒకేసారి దాదాపు వారం రోజులు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

గతంలో విశాఖ ఉత్సవ్‌తో పాటే భీమిలి, అరకు ఉత్సవ్‌లు నిర్వహించేవారు. వైసీపీ ప్రభుత్వం ఒకటి, రెండుసార్లు ఏ ఉత్సవ్‌కు ఆ ఉత్సవ్‌ను విడదీసి నిర్వహించింది. ఆ తరువాత వాటిని గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్వ పద్ధతిలో పర్యాటకాభివృద్ధికి ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఏడాది ముందు భీమిలి ఉత్సవ్‌ నిర్వహించాలని పర్యాటక శాఖాధికారులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండుసార్లు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఇరవై రోజుల క్రితం అరకులోయలో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవ్‌పై చర్చించారు. వీటికి అవసరమైన నిధుల కోసం పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయగా, విడివిడిగా వద్దని, అన్నీ కలిపి ఒకేసారి ‘విశాఖ ఉత్సవ్‌’ పేరుతో నిర్వహించాలని సూచించింది. గతంలో ఈ ఉత్సవాలు మూడు రోజులు మాత్రమే నిర్వహించేవారు. డిసెంబరు నెలలో క్రిస్మస్‌, ఆదివారం సెలవు కలిసి వచ్చేలా చూసుకొని తేదీలు ఖరారు చేసేవారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో ట్రెజర్‌ హంట్‌, అరకులో బెలూన్‌ ఉత్సవ్‌, హెలీ టూరిజం వంటి ప్రత్యేక ఆకర్షణలతో మూడు రోజులు సంబరంగా చేసేవారు. ఈసారి అంతకు మించి నిర్వహించాలని, కనీసం ఐదు రోజులు, గరిష్ఠంగా వారం రోజులు ఉత్సవ్‌ ఉండాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం. యోగాంధ్ర మాదిరిగా భారీఎత్తున నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా భారీ అలంకరణలతో ‘క్రిస్మస్‌ ట్రీ’ పెడతారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఏ ఉత్సవమైనా నిధులు చాలా ముఖ్యం. పర్యాటక శాఖకు ఇదే పెద్దలోటు. వీటిని ఎలా సమకూరుస్తారనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వీటిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

Updated Date - Nov 23 , 2025 | 12:50 AM