నిఘా నీడలో విశాఖ
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:23 AM
ఈ నెల 14, 15 తేదీల్లో పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతున్నందున్న విశాఖ నగరంలో అణువణువునా గస్తీ ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు
పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 14, 15 తేదీల్లో పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతున్నందున్న విశాఖ నగరంలో అణువణువునా గస్తీ ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం రాత్రి నక్కపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విశాఖ నగరమంతా డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమ్మిట్‌కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబునాయుడు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని, అందుచేత నగరమంతా కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలన్నారు. ఫైర్ సేఫ్టీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా వుంచాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.