Share News

ఏపీఈసెట్‌ ఫలితాల్లో సత్తా చూపిన విశాఖ విద్యార్థులు

ABN , Publish Date - May 16 , 2025 | 12:16 AM

ఇంజనీరింగ్‌ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్‌లో విశాఖ విద్యార్థులు తమ సత్తా చూపారు.

ఏపీఈసెట్‌ ఫలితాల్లో  సత్తా చూపిన విశాఖ విద్యార్థులు

  • పలు కేటగిరీల్లో ప్రథమ ర్యాంకులు

  • కెమికల్‌ ఇంజనీరింగ్‌ టాప్‌ టెన్‌ ర్యాంకున్నీ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలవే..

విశాఖపట్నం/కంచరపాలెం, మే 15 (ఆంధ్రజ్యోతి):

ఇంజనీరింగ్‌ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్‌లో విశాఖ విద్యార్థులు తమ సత్తా చూపారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 128 మార్కులతో అగనంపూడి సమీపంలోని పెదమడకకు చెందిన గొలగాని శశాంత్‌ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. వడ్లపూడికి చెందిన దొడ్డి యశ్వంత్‌ 121 మార్కులతో మూడో ర్యాంకు, శ్రీహరిపురానికి చెందిన తాడి ప్రనూశ్‌ 118 మార్కులతో నాలుగో ర్యాంకు, కూర్మన్నపాలెంలో ఉంటున్న ఎస్‌.తేజశిరాజ్‌ 117 మార్కులతో ఐదో ర్యాంకు, మర్రిపాలేనికి చెందిన నాయుడు జయశ్రీ 116 మార్కులతో 7, గోపాలపట్నానికి చెందిన ఎ.మాధవి శ్రీలేఖ 115 మార్కులతో 8, మధురవాడకు చెందిన మీసాల సాయివర్షిణి 113 మార్కులతో 9, పెందుర్తి దొగ్గవానిపాలేనికి చెందిన బి.ప్రశాంతి 111 మార్కులతో 10వ ర్యాంకును సాధించారు.

అలాగే కెమికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో టాప్‌ టెన్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్థుందరూ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో పాలిటెక్నిక్‌ కోర్సు చదివినవారే కావడం విశేషం. వీరిలో ఏడుగురు కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఒకరు ప్లాస్టిక్‌ పాలిమర్స్‌, మరొకరు పెట్రోలియం ఇంజనీరింగ్‌, ఇంకొకరు ఆయిల్‌ టెక్నాలజీ కోర్సును పూర్తి చేశారు. అలాగే కంచరపాలెంలోని ప్రభుత్వ పాలటెక్నిక్‌ కళాశాలలో మెటలర్జీ విభాగంలో ఎన్‌.అభిషేక్‌ ఫస్ట్‌ ర్యాంకు, ఎస్‌.భువనేశ్వరి 4వ ర్యాంకు, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కె.సత్య సాయికృష్ణ కౌశిక్‌ 3వ సాధించారు, ఎస్‌.మేఘన 4, కె.యతేంద్ర 6, వి.గీతిక 9వ ర్యాంకులను సాధించారు. కాగా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఎం.హసీన్‌హుద్దీన్‌ 9వ ర్యాంకు, సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఎ.కేశవరావు 11వ ర్యాంకు సాధించారు. ఇదిలావుండగా జిల్లాలో అన్ని కోర్సులకు కలిపి 4,855 మంది పరీక్షకు హాజరవ్వగా 4,506 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 3,198 మందికి 2,930, మహిళలు 1,657 మందికి 1,576 మంది అర్హత సాధించారు.

ఐఐటీలో ఎంటెక్‌ చేస్తా..

శశాంత్‌, ఫస్ట్‌ ర్యాంకర్‌

ఈసెట్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంజనీరింగ్‌లో రెండో ఏడాదిలో ప్రవేశించి బీటెక్‌ పూర్తి చేశాక గేట్‌ రాసి ఐఐటీలో సీటు సంపాదించడమే లక్ష్యం. ఆ తరువాత ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్‌లో చేరాలి. మా తండ్రి గొలగాని శ్రీనివాసరావు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.


డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు వైసీపీ దూరం!

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 19న జరగనున్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. డిప్యూటీ మేయర్‌ పదవిలో ఉండగా జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఈ పదవి కోసం ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం విధితమే. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం సభ్యులందరికీ ఎన్నికల అధికారి హోదాలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇప్పటికే నోటీసులు అందజేశారు. డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 56 ఓట్లు అవసరం. అయితే కూటమికి 74 మంది కార్పొరేటర్లు/ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం ఉండడంతో కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవ్వడం లాంఛనమేనని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికకు హాజరవ్వకూడదని వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను ఆదేశించినట్టు సమాచారం.


బీచ్‌ రోడ్డులో ఖాకీల వసూళ్లు నిజమే..

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై పీఎంపాలెం పోలీసుల దర్యాప్తు

మద్యం దుకాణాలు, పాన్‌షాప్‌లకు వెళ్లి విచారణ

ఓ కానిస్టేబుల్‌కు ఫోన్‌పే చేయించుకున్నట్టు స్ర్కీన్‌ షాట్‌ల సేకరణ!

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌ రోడ్డులో మందుబాబులు, ప్రేమ జంటల నుంచి కొందరు పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడున్నట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని పోలీస్‌ అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. బీచ్‌ రోడ్డులోని మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించి వాహనాలపై వెళ్లేవారిని, ఈ రోడ్డులో తిరిగే ప్రేమ జంటలను కొంతమంది బీచ్‌పెట్రోలింగ్‌ పోలీసులు బెదిరించి డబ్బులు గుంజేస్తుండడంపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘బీచ్‌ రోడ్డులో ఖాకీల దందా’ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీపీ శంఖబ్రత బాగ్చి సమగ్రంగా విచారణ జరపాలంటూ బీచ్‌ రోడ్డు పరిధి కలిగిన భీమిలి, పీఎంపాలెం, ఆరిలోవ, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు ఆయా పోలీస్‌ స్టేషన్ల అధికారులు బీచ్‌ రోడ్డులోని మద్యం దుకాణాలు, పాన్‌ షాప్‌ల వద్దకు వెళ్లి పోలీసుల బలవంతపు వసూళ్ల గురించి ఆరా తీయడంతో పాటు వారి సెల్‌ ఫోన్‌లోని ఫోన్‌పే హిస్టరీలో తమ బీచ్‌ పెట్రోలింగ్‌ సిబ్బందికి సంబంధించి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? అని పరిశీలించారు. ఈ క్రమంలో పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం దుకాణం సిబ్బందితోపాటు ఓ పాన్‌ షాప్‌ నిర్వాహకుడి నుంచి ఒక కానిస్టేబుల్‌ ఫోన్‌పే చేయించుకున్నట్టు హిస్టరీలో కనిపించడంతో వాటి స్ర్కీన్‌ షాట్‌లను ఆ స్టేషన్‌ అధికారి తీసుకున్నట్టు తెలిసింది. సిబ్బంది వసూళ్లకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Updated Date - May 16 , 2025 | 12:16 AM