Share News

విశాఖ వాసులకు దక్కని ‘శ్రీవాణి’ టికెట్లు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:58 AM

తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. పది వేల రూపాయలు డొనేషన్‌గా ఇస్తే ‘శ్రీవాణి’ పేరుతో టికెట్‌ ఇస్తారు.

విశాఖ వాసులకు దక్కని ‘శ్రీవాణి’ టికెట్లు

  • తిరుపతి విమానాశ్రయంలో ఉదయం 8 గంటలకు కౌంటర్‌ ఓపెన్‌

  • రోజుకు 200 టికెట్లు విక్రయం

  • రూ.10 వేల డొనేషన్‌, రూ.500 టికెట్‌ ధర ఇస్తే శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి టోకెన్‌

  • 8.30 గంటలలోపు హైదరాబాద్‌ నుంచే ఐదు విమానాలు

  • 3 గంటలకు ల్యాండ్‌ అవుతున్న విశాఖ విమానం

  • సమయం మార్చాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. పది వేల రూపాయలు డొనేషన్‌గా ఇస్తే ‘శ్రీవాణి’ పేరుతో టికెట్‌ ఇస్తారు. దాంతో వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో స్వామిని అతి దగ్గర నుంచి చూసే భాగ్యం కలుగుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల తిరుపతి విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటుచేసి శ్రీవాణి టికెట్లను విక్రయిస్తోంది. రోజుకు 200 మాత్రమే ఇస్తుంది. ఉదయం 8 గంటలకు కౌంటర్‌ తెరుస్తున్నారు. టికెట్‌ కావలసిన వారు ఏ విమానంలో వచ్చారో దానికి సంబంధించిన బోర్డింగ్‌ పాస్‌తో పాటు గుర్తింపు కార్డు ఏదైనా సమర్పిస్తే వెంటనే రూ.10 వేలు డొనేషన్‌, రూ.500 టికెట్‌ ధర తీసుకొని టోకెన్‌ ఇస్తున్నారు. ఆ టికెట్‌తోనే కొండపై వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. అయితే ఈ టికెట్లు ఉదయం తొమ్మిది గంటలకే అయిపోతున్నాయి. ఆ తరువాత విమానాల్లో తిరుపతి చేరుకున్న వారికి శ్రీవాణి టికెట్లు దొరకడం లేదు. తిరుపతి విమానాశ్రయానికి ఉదయం 8.30 గంటలలోపు ఒక్క హైదరాబాద్‌ నుంచే ఐదు విమానాలు వస్తున్నాయి. ఆ తరువాత ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి మరొకటి పది గంటలలోపు వస్తున్నాయి. తిరుపతికి విమానంలో వచ్చారంటే స్వామి దర్శనం కోసమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్కో విమానంలో వంద మంది చొప్పున లెక్క వేసుకుంటే 8.30 గంటల్లోపు హైదరాబాద్‌ నుంచే 500 మంది వస్తున్నారు. ఆ 200 టికెట్లు వారికే సరిపోవడం లేదు. ఆ తరువాత దిగిన వారికి టికెట్లు ఉండడం లేదు. విశాఖ నుంచి మధ్యాహ్నం బయలుదేరే విమానం తిరుపతిలో మూడు గంటలకు ల్యాండ్‌ అవుతోంది. అప్పటికే కౌంటర్‌ మూసేస్తున్నారు. దాంతో శ్రీవాణి టికెట్లు దొరకడం లేదు. అందుకని విశాఖ నుంచి తిరుపతి విమానం ప్రయాణ వేళలు మార్చాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే...విశాఖ ప్రయాణికులకు కొన్ని టికెట్లు కేటాయించి, వాటిని ఇక్కడి విమానాశ్రయంలోనే విక్రయించే ఏర్పాటుచేయాలని సూచిస్తున్నారు. ఎవరు ముందు వస్తే వారికే అని కాకుండా ప్రతి విమానానికి ఇన్ని టికెట్లు అన్ని కేటాయిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇంకా అవకాశం ఉంటే దేశంలోని ప్రతి విమానాశ్రయానికి కొన్ని శ్రీవాణి టికెట్లు కేటాయించి, వాటిని స్థానికంగానే అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:58 AM