క్విక్ ఈ-కామర్స్‌లో విశాఖ వాసుల దూకుడు
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:00 AM
పాల ప్యాకెట్ నుంచి బంగారు ఆభరణాల వరకూ, ఆకు కూరల నుంచి ఐఫోన్ వరకూ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్న నగర వాసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో వెల్లడి
పాల ప్యాకెట్ నుంచి బంగారు ఆభరణాల వరకూ ఆర్డర్
రూ.5.84 లక్షల విలువైన బంగారు నాణెలు, ఐ ఫోన్లు కొనుగోలు చేసిన ఒకరు
గడిచిన ఏడాదితో పోలిస్తే 434 శాతం పెరిగిన బ్యాగులు, వ్యాలెట్ల ఆర్డర్లు
క్రీడలు, ఫిట్‌నెస్ పరికరాలను కొనుగోళ్లలో 374 శాతం మేర పెరుగుదల
ఆర్డర్స్‌లో అత్యధికం ‘స్నాక్స్’ కోసమే
ఆ తరువాత స్థానంలో నిత్యావసర సరుకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పాల ప్యాకెట్ నుంచి బంగారు ఆభరణాల వరకూ, ఆకు కూరల నుంచి ఐఫోన్ వరకూ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్న నగర వాసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే కిరాణా దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి దాదాపు తగ్గిపోతోంది. అంతా ఇంట్లో కూర్చునే తమకు కావాల్సిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. ఇందుకు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ తరహా ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో విశాఖ వాసులు కూడా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారని దేశంలోని అగ్రగామి క్విక్ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ స్పష్టం చేసింది. 2025 ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికను కొద్దిరోజుల కిందట ‘ఇన్‌స్టామార్ట్’ విడుదల చేసింది. అందులో విశాఖ వాసుల ఆర్డర్‌లను విశ్లేషించింది. గడిచిన ఏడాదితో పోలిస్తే వివిధ కేటగిరీలకు సంబంధించిన వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఖరీదైన ఐటమ్స్ అమ్మకాల ఆర్డర్స్ పదుల రెట్లు పెరిగినట్టు పేర్కొంది.
భారీగా పెరిగిన అమ్మకాలు..
ఈ ఏడాది కాలంలో విశాఖలో బ్యాగులు, వ్యాలెట్ల అమ్మకాలు 434 శాతం, క్రీడలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరికరాలు, సామగ్రి అమ్మకాలు 374 శాతం మేర పెరిగినట్టు ఇన్‌స్టామార్ట్ తెలిపింది. అలాగే నగలు, హెయిర్‌కు సంబంధించిన ఉపకరణాల అమ్మకాలు 249 శాతం, ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులు అమ్మకాలు 161 శాతం, ఇంటి అలంకరణకు వినియోగించే కొన్ని రకాల బొమ్మలు విక్రయాలు 166 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది.
టాప్‌లో స్నాక్స్ అమ్మకాలు..
ఆర్డర్స్‌లో అత్యధికం స్నాక్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఈ జాబితాలో చిప్స్, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ టాప్‌లో ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ఫెస్టివల్స్ సందర్భాల్లో వీటి ఆర్డర్లు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి.
నిత్యావసర సరకులకు భారీగా..
ఇకపోతే, ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, ఉల్లిపాయలు, పాలు, పెరుగు ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పంచదార, పప్పులు, ఉప్పు వంటివి కూడా నగరవాసులు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడుతున్నారు. ఆర్డర్స్ జాబితాలో నిత్యావసర సరుకులు రెండో స్థానంలో ఉన్నాయి.
రూ.5.84 లక్షలు ఆర్డర్ పెట్టిన ఒకే వ్యక్తి..
ఈ ఏడాది కాలంలో నగరానికి చెందిన ఒకరు ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసి సుమారు రూ.5.84 లక్షల విలువజేసే వస్తువులను తెప్పించుకున్నారు. బంగారు నాణెలు, ఐఫోన్లు కోసం ఆ మొత్తాన్ని వెచ్చించినట్టు వెల్లడించింది. మరొకరు 24 క్యారెట్ల బంగారు నాణెం కోసం లక్ష రూపాయలను వెచ్చించారు. విశాఖలో అత్యధిక విలువ కలిగిన సింగిల్ ఆర్డర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది కాలంలో ఐ ఫోన్ 16, ఐ ఫోన్ 16 ప్రో ఫోన్లు కొనుగోళ్లకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్ పెట్టిన నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ అవుతుండడంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వైపు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.