విశాఖకు విశ్వ ఖ్యాతి
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:39 AM
విశాఖ కొత్త నగరంగా, ఏఐ సిటీగా ఎదుగుతుంది.
గూగుల్ రాకతో కంపెనీల ఏర్పాటుకు పలు దేశాల ఆసక్తి
ప్రభుత్వ ఆహ్వానంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులు
డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ సంసిద్ధం
పలు ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కొత్త నగరంగా, ఏఐ సిటీగా ఎదుగుతుంది. ఇక్కడి ఎకో సిస్టమ్ భవిష్యత్తు తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. టీసీఎస్‌కు దేశ నిర్మాణం ముఖ్యం. విశాఖలో పెట్టుబడులు పెట్టడం మా మనసుకు దగ్గరైన విషయం. ఇది అభివృద్ధి చెందుతున్న నగరం. అందరినీ కలుపుకుని పోయే విధానానికి మేము అనుకూలం.. అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమైనది. పెట్టుబడి పెట్టడానికి కారణం కేవలం వ్యాపారమే కాదు.. నగరానికి ఉన్న సానుకూల దృక్పథంఒక కారణం. విశాఖలో నైపుణ్యతకు కొదవలేదు. సకాలంలో ప్రాజెక్టుపూర్తిచేసి డెలివరీ చేయాలన్న పట్టుదల ఉంది. అది మమ్మల్ని ఆకట్టుకుంది’.
- శ్రీధరన్ వెంకటరమణ, టీసీఎస్ కీలక ప్రతినిధి
సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా విశాఖపట్నం పేరుఅంతర్జాతీయంగా మార్మోగింది. రెండురోజుల సదస్సుకు 45 దేశాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకావడం సదస్సు ప్రాధాన్యతను తేటతెల్లం చేసింది. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక సంస్థలు విశాఖలో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కొందరు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ప్రసిద్ధ ఐటీ సంస్థ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖను ఎంపికచేసిన అనంతరం నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో అనేకమంది విశాఖ పేరును పదేపదే చెబుతూ ప్రశంసిస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకునేందుకు పలుదేశాల ప్రముఖులు నగరానికి తరలివచ్చారు. భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాలలో రోడ్‌షోలు నిర్వహించి అక్కడ ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. సీఎం అరబ్ దేశాలు, ఇంగ్లండ్, లోకేశ్ ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల్లో పర్యటించారు. ఏపీలో వనరులు, వసతులు, ప్రభుత్వ రాయితీలను వివరించడంతో వారంతా సదస్సుకు హాజరయ్యారు. అంతేకాకుండా గూగుల్ వంటి సంస్థ విశాఖను ఎంచుకోవడంతో నగరం ప్రాముఖ్యత తెలుసుకునేందుకు పలుదేశాల ప్రతినిధులు వచ్చారు. ఇక్కడి అతిథి మర్యాదలు, విశాఖలో సుందర దృశ్యాలు, వనరులు వారిని మంత్రముగ్ధులను చేశాయి. పెట్టుబడుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పలువురు కంపెనీ ప్రతినిధులు పరిశీలించి హామీలు ఇచ్చారు. పెట్టుబడులు కోసమే కాదని, నాలెడ్జిని ఇచ్చి పుచ్చుకోవడం, కొత్త ఆవిష్కరణలపై చర్చలు చేపట్టడంపై విశ్లేషణలకు సదస్సు వేదికగా మారిందని ప్రశంసించారు.
రిలయన్స్ డేటా సెంటర్
విశాఖలో గూగుల్ కంపెనీ ఒక గిగా వాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రకటన చేయడంతో ప్రపంచంలో అనేక కంపెనీల కన్ను విశాఖ వైపు పడింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థ ఒక గిగావాట్ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించింది. దీనికితోడు మరో కంపెనీ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పలు ఐటీ కంపెనీలు విశాఖలో తమ శాఖలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. త్వరలో టీసీఎస్, కాంగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఇన్ఫోసిస్ విశాఖ సెంటర్‌ను విస్తరించనున్నది. ఈనెల 13వ తేదీన ఐటీ మంత్రి లోకేశ్ రుషికొండ ఐటీ సెజ్‌లో పలు కంపెనీలకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహిచేందుకు ఆసక్తి చూపాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపనచేశారు.
పర్యాటక రంగానికి ఊతం
జలవిహార్ గ్రూప్ మధురవాడలో టూరిజం పార్కు ఏర్పాటు చేయనుంది. సన్ ఇనిస్టిట్యూట్ రూ.150 కోట్లతో బీచ్‌రోడ్డులో హోటల్ నిర్మించనున్నది. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. క్రూయిజ్ వ్యాపార విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ నుంచి చెన్నై వరకు నడుపుతున్న సీ క్రూయిజ్ ఫ్రీక్వెన్సీ పెంచేందుకు నిర్ణయించారు. విశాఖ శివారున హిందూజా గ్రూప్ థర్మల్‌ప్లాంట్‌ను విస్తరించనుంది. నక్కపల్లి సమీపంలో స్టీల్ సిటీ రానున్నది. పరవాడ, అచ్యుతాపురం ఫార్మాసిటీలలో పలు ఔషధ కంపెనీలు కొత్త యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు నిర్వహణ ద్వారా విశాఖలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నగరాభివృద్ధికి దోహదపడడంతో పాటు ఉత్తరాంధ్ర పరిధిలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెబుతున్నారు.
సమన్వయంతోనే సదస్సు సక్సెస్
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ అన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమయిందన్నారు. ఆదివారం ’ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సదసు వేదిక నిర్మాణం నుంచి సెషన్ల నిర్వహణ బాధ్యతలు, ఫుడ్, రవాణా, హోటళ్లలో గదుల కేటాయింపు, ఎయిర్‌పోర్టులో స్వాగతం, ప్రముఖుల పర్యటనలు సాఫీగా సాగడానికి అఽధికారులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. దేశ, విదేశాల నుంచి అతిథులు, పారిశ్రామికవేత్తలు వస్తున్న నేపథ్యంలో నగరంలో రోడ్లు, లైటింగ్, సుందరీకరణను జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పర్యవేక్షించారన్నారు. ముఖ్య కూడళ్లను అద్భుతంగా అలంకరించారన్నారు. సదస్సులో ప్రతి హాలులో సెమినార్లు సజావుగా జరిగేలా ఒక్కో అధికారికి బాధ్యత అప్పగించామన్నారు. జీసీసీ ఎండీ కల్పనాకుమారి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారని, ప్రధాన హాలు బాధ్యత భీమిలి ఆర్డీవోకు అప్పగించామన్నారు. ఒప్పందాల నిర్వహణ, పారిశ్రామికవేత్తలతో సమన్వయం పరిశ్రమల శాఖ పర్యవేక్షించిందన్నారు. ప్రధాన వేదిక ముందు అలంకరణ వీఎంఆర్డీఏ చేపట్టిందన్నారు. ఎయిర్‌పోర్టులో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి అతిథులకు స్వాగతంపలికే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు బాధ్యత కొందరు అధికారులకు అప్పగించామన్నారు. ప్రత్యేక విమానాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు.
డెలిగేట్లు, అతిథులు, రాయబారులు, ఉన్నతాధికారులకు వాహనాలు, హోటళ్లలో గదుల కేటాయింపు తదితరాలను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చక్కగా పర్యవేక్షించారని ప్రశంసించారు. సదస్సుకు రెండురోజుల ముందుగానే సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చారని అప్పటి నుంచి ప్రతి కార్యక్రమం సజావుగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 13న నోవాటెల్‌లో సదస్సులు, ఒప్పందాలు జరిగాయని, 14న సదస్సుతో పాటు నోవాటెల్‌లో ఆర్థిక అంశాలపై సమావేశాలు జరిగాయన్నారు. ఎగ్జిబిషన్‌లో స్టాల్స్, రిజిస్ట్రేషన్, ఆంధ్రపెవిలియన్, సీఎం కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రతి అంశానికి ఒక అఽధికారిని నియమించామన్నారు. వాహనాల పార్కింగ్ ప్రముఖుల వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా నగర పోలీసులు చక్కగా పనిచేశారని ప్రశంసించారు. అనేక దేశాల నుంచి వచ్చిన అతిథుల భద్రత, నగరంలో ట్రాఫిక్ తదితరాలన్నీ సీపీ శంఖబ్రతబాగ్చి పర్యవేక్షణలో పక్కా ప్లానింగ్‌తో నిర్వహించారన్నారు. సదస్సు సజావుగా జరగడంతో విశాఖకు మంచి పేరు వచ్చిందని, దీనికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సీఐఐ టీమ్, మీడియాకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.