Share News

విశాఖే ఆర్థిక రాజధాని

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:51 AM

రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నమేనని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ దిశా నిర్దేశం చేశారు.

విశాఖే ఆర్థిక రాజధాని

జిల్లా దశ, దిశ మారుద్దాం

అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి

ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం

ఇక్కడి ప్రజల మద్దతు ఎప్పుడూ టీడీపీకే

ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నం,అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నమేనని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తులో చోటుచేసుకునే మార్పులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం దశ, దిశ మార్చేలా ప్రణాళికలు ఉండాలన్నారు. రానున్న ఐదేళ్లలో ఏటీ రంగంలో యువతకు 5 లక్షల ఉద్యోగాలను కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు నాలుగు జిల్లాలు, అరకు, పాడేరుతో కలిపి గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌ అభివృద్ధి, ఇతర అంశాలపై ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అఽధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బెంగళూరు, పుణే లాంటి నగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యలు విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని, విశాలంగా రోడ్లు అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖ వేదికగా అనేక కంపెనీలు వస్తున్నాయని, రానున్న 30 సంవత్సరాలకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిఽధులు, అఽధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేథోపరమైన చర్చ జరగాలన్నారు. అనేక కంపెనీలు, అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకాబోతున్నాయని, దీంతో ఈ రీజియన్‌లోని యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన విధంగా ఆలోచించి ప్రణాళికలు తయారుచేయాలని నిర్దేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేని విధంగా మిషన్‌ మోడ్‌లో అభివృద్ధి జరగాలని, వారికి ఆమోదయోగ్యమైన విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో విశాఖ రీజియన్‌లో ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువుగా ల్యాండ్‌బ్యాంకు సిద్ధంచేయాలని ఆదేశించారు.

టీడీపీకే ప్రజా మద్దతు

అంతకుముందు రుషికొండలో సిఫీ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి లోకేశ్‌ ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విశాఖ వాసులు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతున్నారని, వారి పూర్తి మద్దతు టీడీపీకేనని అన్నారు. హుద్‌హుద్‌ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబులు నగరానికి వస్తే, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వారికి చిరునవ్వుతో స్వాగతం పలికిన గొప్ప మనసున్న ప్రజలని ప్రశంసించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల టీడీపీ నేతలు ఓడిపోతే విశాఖలో టీడీపీకి పట్టం కట్టారన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారని, అప్పుడు కూడా తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి మూడు లక్షల మంది బీచ్‌కు తరలివచ్చారని గుర్తు చేశారు. విశాఖపట్నాన్ని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా చేస్తామన్నారు. ఐటీలో హైదరాబాద్‌ 30 ఏళ్లకు అభివృద్ధి సాధిస్తే.. అదే అభివృద్ధిని ఇక్కడ పదేళ్లలో సాధించాలని ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు.

సమీక్ష సమావేశంలో ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, ప్రభుత్వ విప్‌ పి.గణబాబు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఏపీ కోఆపరేటివ్‌ గ్రోవర్స్‌ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జీ, ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు వైస్‌చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు స్వప్నిల్‌ దినకర్‌ పుండర్కర్‌, రామసుందరరెడ్డి, ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, విజయకృష్ణన్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, విశాఖ జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్వో భవానీశంకర్‌, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాఽథుర్‌, వీఎంఆర్‌డీఏ సీయూపీ శిల్ప ఇతర అఽదికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:51 AM