Share News

ప్రో కబడ్డీకి వేదికగా విశాఖ

ABN , Publish Date - Aug 01 , 2025 | 01:00 AM

ప్రో కబడ్డీ లీగ్‌కు (పీకేఎల్‌) విశాఖ ఆతిథ్యమివ్వనున్నది. సీజన్‌-12 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీకేఎల్‌ యాజమాన్యం గురువారం ప్రకటించారు.

ప్రో కబడ్డీకి వేదికగా విశాఖ

పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో 28 మ్యాచ్‌లు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 11 వరకూ నిర్వహణ

విశాఖపట్నం, స్పోర్ట్సు, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ప్రో కబడ్డీ లీగ్‌కు (పీకేఎల్‌) విశాఖ ఆతిథ్యమివ్వనున్నది. సీజన్‌-12 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీకేఎల్‌ యాజమాన్యం గురువారం ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి అక్టోబరు 23 వరకు జరగనున్న మెగా టోర్నీలో 108 మ్యాచ్‌లకు జైపూర్‌, చెన్నై, ఢిల్లీతోపాటు విశాఖలోని పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియాన్ని వేదికగా ఖరారు చేసింది. ఈ టోర్నీలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 11 వరకు జరగనున్న 28 మ్యాచ్‌లకు పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం వేదికగా నిలవనున్నది. 14 రోజులపాటు జరగనున్న ఈ మ్యాచ్‌లలో హోమ్‌ టీమ్‌ తెలుగు టైటాన్స్‌తోపాటు బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్‌, హరియాణా స్టీలర్స్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, పాట్నా పైరేట్స్‌, పుణేరి పల్డన్‌, తమిళ్‌ తలైవాస్‌, యు ముంబా, యుపీ యోధా...మొత్తం 12 జట్లు తలపడనున్నాయి.

దాదాపు ఏడేళ్ల తర్వాత

2014లో ఇండియన్‌ ప్రొఫెషనల్‌ కబడ్డీ లీగ్‌ తొలి సీజన్‌ టోర్నీ విశాఖ నుంచే ప్రారంభం కావడం విశేషం. తెలుగు టైటాన్స్‌ హోమ్‌ టీమ్‌గా ఆగస్టు 16 నుంచి 19 వరకూ జరిగిన ఏడు మ్యాచ్‌లకు పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం వేదికైంది. ఆ తర్వాత పీకేఎల్‌ సీజన్‌-3 టోర్నీకి సంబంధించి 2016లో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకూమరో ఏడు మ్యాచ్‌లు జరిగాయి. చివరిగా పీకేఎల్‌ సీజన్‌-6కు సంబంధించి 2018లో డిసెంబరు 7 నుంచి 13 వరకూ జరిగిన 11 మ్యాచ్‌లకు పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం వేదికగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన సీజన్లకు తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం హోమ్‌ గ్రౌండ్‌గా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని వేదిక చేసుకున్నది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి జరగనున్న పీకేఎల్‌ సీజన్‌-12 టోర్నీకి విశాఖ ఆతిథ్యమివ్వనుంది.


నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లాలో 1,58,235 మందికి శుక్రవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం రూ.69.34 విడుదలైనట్టు చెప్పారు. శుక్రవారం అందుబాటులో లేని పింఛన్‌దారులకు శనివారం ఇస్తామన్నారు. పింఛన్‌దారులు శుక్ర, శనివారాలు ఇళ్ల వద్ద ఉండాలని కోరారు. కాగా, పింఛన్‌ పొందుతూ చనిపోయిన వారి భార్యకు పింఛన్‌ మంజూరుచేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. కొత్తగా 2,524 మందికి వితంతు పెన్షన్లు మంజూరయ్యాయన్నారు.


మండలాలకు ప్రత్యేకాధికారులు

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల

పర్యవేక్షణకుగాను నియామకం

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకుగాను జిల్లా స్థాయి అధికారులను మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. భీమిలి మండలానికి భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాథుర్‌, ఆనందపురం మండలానికి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, పద్మనాభం మండలానికి జాతీయ రహదారుల విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జ్ఞానవేణి, విశాఖ రూరల్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సత్యసుధ, మహారాణిపేటకు విశాఖ ఆర్డీవో శ్రీలేఖను నియమించారు. సీతమ్మధారకు డీసీవో ప్రవీణను, గోపాలపట్నానికి జిల్లా పర్యాటకాధికారి జె.మాధవిని, ములగాడకు డ్వామా పీడీ ఆర్‌.పూర్ణిమాదేవిని, గాజువాకకు వీఎంఆర్‌డీఏ ఎస్టేట్‌ అధికారి బి.దయానిధిని, పెందుర్తికి జిల్లా హౌసింగ్‌ మేనేజరు సీహెచ్‌ సత్తిబాబును, పెదగంట్యాడకు ఉక్కు భూసేకరణ ఎస్డీసీ సునీతను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరిలో కొందరికి పీ-4 పథకం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు.


సింహగిరిపై పెళ్లిళ్లకు రూ.10 వేలు చార్జి

గజపతి సత్రం, లోవ తోట సహా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అనుమతి

కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు

సింహాచలం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

సింహగిరిపై వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో వివాహం చేసుకోదలచినవారు దేవస్థానానికి పది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. గతంలో ఉచితంగానే అనుమతించేవారు. మూడేళ్ల క్రితం టెండర్‌ పిలిచి కాంట్రాక్టుకు ఇచ్చారు. దేవస్థానం నిర్ణయించిన ధర కంటే ఆ కాంట్రాక్టర్‌ అధికంగా వసూలు చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో అధికారులు కాంట్రాక్టు విధానానికి స్వస్తి చెప్పడానికి సమ్మతించారు. గురువారంతో కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో సింహగిరిపై అనుమతించిన స్థలాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు రూ.10 వేలు చెల్లించి నెలరోజుల ముందుగానే ఆ ప్రాంతాలను రిజర్వు చేసుకోవాలంటూ ఈఓ ప్రకటన విడుదల చేశారు. తాజా ఆదేశాల ప్రకారం గజపతి సత్రం, పాదాలమ్మ, బంగారమ్మ గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్‌ ప్రాంతం, లోవ తోట, అదేవిధంగా ప్రత్యేక కండిషన్‌లో అధికారులు సమ్మతించిన స్థలాల్లో వివాహాలకు అనుమతిస్తారు. వివాహం తరువాత మూడు గంటలలోపు అందుకు వాడిన కుర్చీలు, మండపాలు, సోఫాలు, తదితరాలను అక్కడ నుంచి ఖాళీ చేయాలి. వివాహం చేసుకోదలచిన వారి నుంచి పారిశుధ్యం నిమిత్తం రూ.2 వేలు, అడ్వాన్స్‌ రూపంలో రూ.5 వేలు వసూలు చేసి పెళ్లి అనంతరం తిరిగి ఇచ్చే విధంగా పీఆర్‌ఓ కార్యాలయంలో సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఈఓ ఆదేశించారు.

Updated Date - Aug 01 , 2025 | 01:00 AM