ఐటీ హబ్‌గా విశాఖ
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:16 AM
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
టీసీఎస్ ద్వారా 12 వేల మందికి, కాగ్నిజెంట్ ద్వారా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే నగరానికి మరిన్ని ఐటీ కంపెనీలు
సూపర్ సిక్స్ కాదు సూపర్ 12 పథకాలు అమలు చేశాం
స్ర్తీశక్తి పథకం ద్వారా బస్సుల్లో రోజుకు 2.26 లక్షల మంది ఉచిత ప్రయాణం
2,30,496 మందికి తల్లికి వందనం
చేపల వేట నిషేధ కాలంలో 12,138 మంది మత్స్యకారులకు భృతి కింద రూ.20 వేల వంతున చెల్లింపు
ఎన్టీఆర్ వైద్యసేవ కింద 90,748 మందికి ఉచితంగా వైద్యం
రూ.1,405 కోట్లతో జీవీఎంసీలో వివిధ అభివృద్ధి పనులు
నగరంలో కొత్తగా 10,805 దీపాల ఏర్పాటుకు రూ.6.52 కోట్లు వ్యయం
రూ.16,219 కోట్లతో మూడు భారీపరిశ్రమలు...34,120 మందికి ఉపాధి
ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో తప్పులు నిగ్గుతేల్చాం
భూ ఆక్రమణదారులకు చెక్ పెట్టేందుకు గ్రాబింగ్ యాక్టు
వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి భోగాపురం ఎయిర్‌పోర్టు
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
స్వాతంత్య్ర దినోత్సవంలో
రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, డేటాగా తీర్చిదిద్దుతామన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికాలంలో విశాఖకు భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ ఏర్పాటుచేయనున్న డేటా సెంటర్‌తో విశాఖకు మరికొన్ని ఐటీ కంపెనీలు రానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు టీసీఎస్ సంస్థ రూ. 1,370 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 12 వేల మందికి, కాగ్నిజెంట్ రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఎనిమిది వేల మందికి, సత్వా గ్రూపు రూ.1500 కోట్లతో 25 వేల మందికి, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టి పది వేల మందికి ఉపాధి కల్పించనున్నాయని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో రూ. 1.35 లక్షల కోట్లతో ఆర్సెల్లార్ మిట్టల్, నిస్సాన్ నెలకొల్పనున్న ఉక్కు కర్మాగారంలో 55 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
గత ఏడాది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికే 12 పథకాలు అమలు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్టు చెప్పారు. గడచిన ఏడాదికాలంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం ద్వారా 10 లక్షలమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. శుక్రవారం నుంచి అమలులోకి రానున్న స్త్రీశక్తి పథకం ద్వారా జిల్లాలో ప్రతిరోజు 579 బస్సుల ద్వారా 2,26,851 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయనున్నారని మంత్రి తెలిపారు. దీపం-2 కింద 7.3 లక్షల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు అందించడం కోసం రూ. 59.32 కోట్లు జమ చేశామన్నారు.
పేద పిల్లల చదువు కోసం తల్లికి వందనం పేరిట జిల్లాలో 2,30,496 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.299 కోట్లు జమ చేశామని మంత్రి తెలిపారు. 776 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద 18 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.12.9 కోట్లు జమ చేశామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో భృతి కింద 12,138 మంది మత్స్యకారులకు రూ.20 వేల వంతున చెల్లించామన్నారు. జిల్లాలో 4,604 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.38 లక్షలు కేటాయించామన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి 25,063 కుటుంబాలలో 34,075 మందికి 12 లక్షల పనిదినాలు కల్పించి రూ.33.14 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. విశాఖ పోర్టు సాయంతో పొలం గట్లు, చెరువు గట్లపై 12,946 మొక్కలు నాటడం జరిగిందన్నారు. వీఎంఆర్‌డీ మాస్టర్ ప్లాన్ అమలు కోసం భీమిలి-నర్సీపట్నం రోడ్‌కు సంబంధించి జిల్లా పరిధిలో విస్తరణకు రూ.34 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఇంతవరకు 90,748 మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలకు రూ.158.49 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 2.44 లక్షల కుటుంబాల్లో 9.11 లక్షల మంది అర్హత పొందారన్నారు.
జీవీఎంసీ పరిధిలో రూ.1,405 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు వివిధ పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అమృత్ 2.0లో భాగంగా మంచినీటి సరఫరా మెరుగుకు రూ.360.77 కోట్లతో 27 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకూ ఐదు పూర్తయ్యాయన్నారు. నగరంలో 1.18 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఉండగా కొత్తగా 10,805 దీపాల ఏర్పాటుకు రూ.6.52 కోట్లు వెచ్చించామన్నారు. నగరంలో 740 ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు రూ.56 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. 25 అన్న క్యాంటీన్లలో రూ.3.33 కోట్లు వెచ్చించి 64 లక్షల మందికి భోజనం అందించామన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా రూ.17.73 కోట్లతో పెందుర్తిలో రెండు కన్వెన్షన్ సెంటర్లు, సిరిపురంలో రూ.87.5 కోట్లతో మల్టీలెవెల్ పార్కింగ్, రూ.3.49 కోట్లతో వాణిజ్య సముదాయాలు నిర్మించామన్నారు. కైలాసగిరిపై జిప్ లైనర్, స్కై సైక్లింగ్, గ్లాస్ బ్రిడ్జి ఇతర ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఎకో హైట్స్ కాటేజెస్, రివ్వాలింగ్ రెస్టారెంట్, ఇతర ప్రాజెక్టుల పనులు రూ.20 కోట్లతో జరుగుతున్నాయన్నారు. వీఎంఆర్‌డీఎ పార్కులో రూ.7.8 కోట్లతో అల్లూరి సీతారామరాజు సెంటినరీ మెమోరియల్ మాన్యుమెంట్ బీచ్ డెక్ రూపొందించనున్నామన్నారు.
జిల్లాలో పేదల కోసం 1.39 లక్షల ఇళ్లు మంజూరుచేయగా, ఇప్పటివరకూ 49 వేల ఇళ్లు పూర్తిచేశామన్నారు. సీఎం సూర్యఘర్ కింద 2,460 సోలార్ రూఫ్‌టాప్ ప్యానళ్ల పనులు పూర్తిచేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. రూ.16,219 కోట్ల పెట్టుబడులతో మూడు భారీ పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా 34,120 మందికి, రూ.244 కోట్లతో 7,371 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించడం ద్వారా 13,637 మందికి ఉపాధి కలిగిందన్నారు. 54 జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా 4,734 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇంకా తొమ్మిది స్కిల్ హబ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, దీంట్లో 562 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మూడు లక్షల మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో నమోదుకావడం జిల్లాకు గర్వకారణమన్నారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనున్నదని, దీనిలో భాగంగా తొలిదశ పనులు త్వరలో చేపడతామని మంత్రి ప్రకటించారు. మొదటి దశ టెండర్లు ఇప్పటికే పిలిచామని, మూడు కారిడార్లలో 76.9 కిలోమీటర్లకు డీపీఆర్ రూపొందించామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం రూ.11,440 కోట్లు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. విభజన హామీలలో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. జోన్ కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయన్నారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చామన్నారు. భూముల రీసర్వే పనులు 2027 డిసెంబరుకు పూర్తిచేస్తామన్నారు. అసైన్డ్ భూములకు ఫ్రీహోల్డ్ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి తప్పులను నిగ్గు తేల్చామన్నారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానున్నదని మంత్రి ప్రకటించారు. జిల్లాను అభివృద్ధిపథం దిశగా నడిపించేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు, న్యాయాధికారులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
లబ్ధిదారులకు రూ. 214.99 కోట్ల ప్రోత్సాహకాలు అందజేత
గృహ నిర్మాణ శాఖ శకటానికి ప్రథమ, జీవీఎంసీ శకటానికి ద్వితీయ, విద్యా, సమగ్రశిక్షా శకటానికి తృతీయ బహుమతి, ఈపీడీసీఎల్ శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించాయి. మైదానంలో పలు శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి, ఇతర అధికారులు సందర్శించారు. వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను మంత్రి అందజేశారు. సీక్రేడ్ హార్ట్, విశాఖ వ్యాలీ, పద్మనాభం కేజీబీవీ, నడుపూరు, పెందుర్తి జడ్పీ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఏపీ ఆయిల్ సీడ్స్ కో-పరేటివ్ గ్రోయర్స్ చైర్మన్ గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, డీసీపీలు అనిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి, డీఆర్వో భవానీశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.