Share News

మెగాసిటీగా విశాఖ

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:09 AM

ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామమైన విశాఖపట్నం ఇప్పుడు మెగా సిటీగా మారబోతోంది.

మెగాసిటీగా విశాఖ

ఇటు అనకాపల్లి నుంచి అటు విజయనగరం వరకూ విస్తరణ

రాంబిల్లి నుంచి అనకాపల్లి, కొత్తవలస మీదుగా భోగాపురం వరకూ సెమీ రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రతిపాదన

అధ్యయనానికి కన్సల్టెంట్‌ నియామకం

నివేదిక వచ్చిన వెంటనే డీపీఆర్‌ తయారీ

ఐటీ, టూరిజం కారిడార్‌గా అభివృద్ధి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామమైన విశాఖపట్నం ఇప్పుడు మెగా సిటీగా మారబోతోంది. ఇంతింతై వటుడింతై...అనే చందంగా పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లాలను తనలో కలుపుకొంటూ వెళుతోంది. కార్పొరేషన్‌గా ఉండే విశాఖపట్నం పక్కనున్న గాజువాక, భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా మారింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకూ విస్తరించి మెగా సిటీగా తయారు కానుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతిలాగే తిరుపతి, విశాఖలను మెగా సిటీలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొన్ని నిర్ణయాలు తీసుకొంది. రాంబిల్లి నుంచి అనకాపల్లి, కొత్తవలస మీదుగా భోగాపురం వరకు సెమీ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్‌ తయారుచేస్తోంది. కర్ణాటకకు చెందిన ఓ సంస్థకు అధ్యయనం చేసే పని అప్పగించింది. సుమారు 90 కి.మీ. పొడవున వచ్చే ఈ సెమీ రింగ్‌ రోడ్డు పూర్తిగా గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిగా నిర్మించాలనేది యోచన.

ఐటీ, పర్యాటకం కీలకం

అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, రాంబిల్లిలో నేవీ ప్రత్యామ్నాయ స్థావరం వంటివి కీలకంగా మారాయి. విశాఖపట్నంలో గూగుల్‌ డేటా సెంటర్‌, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్నాయి. వీటిన్నింటినీ కలుపుతూ విశాఖను మెగాసిటీ చేయాలనేది ఆలోచన. విశాఖపట్నం మీదుగా ఇప్పటికే జాతీయ రహదారి ఉంది. నగర ప్రజల కోసం మెట్రో రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా అనకాపల్లి నుంచి అలా వెళ్లిపోవడానికి ఆనందపురం వరకూ మరో జాతీయ రహదారిని నిర్మించారు. హైదరాబాద్‌లా విశాఖకు పూర్తిస్థాయి రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కొండలు, సముద్రం అడ్డంకిగా ఉన్నందున అర్ధ చంద్రాకారంలో సెమీ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇది ఎక్కడ కూడా జాతీయ రహదారిని తాకదు. రాంబిల్లిలో మొదలై అనకాపల్లి, కొత్తవలస మీదుగా భోగాపురాన్ని కలుస్తుంది. దీని పొడవు సుమారుగా 90 కి.మీ. ఉంటుందని అంచనా.

విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు భారీగా లభించే ఐటీ, పర్యాటక ప్రాజెక్టులు అనేకం వస్తున్నాయి. ఆనందపురం మండలంలో గూగుల్‌ డేటా సెంటర్‌, మధురవాడలో అదానీ, సిఫీ డేటా సెంటర్లు రానున్నాయి. భోగాపురం సమీపాన ఐటీ సిటీ వంటివి ప్లాన్‌ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌లో పర్యాటక ప్రాజెక్ట్టులు అనేకం వస్తున్నాయి. విశాఖ నుంచి ఆనందపురం మీదుగా అనేక పేరొందిన విద్యా సంస్థలు ఐఐఎం, అనిట్స్‌, గాయత్రి, అవంతి, రఘు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ ఈ మెగాసిటీకి గ్రోత్‌ ఇంజన్లుగా ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

డీపీఆర్‌ తయారుచేస్తాం

ప్రణవ్‌ గోపాల్‌, చైర్మన్‌, వీఎంఆర్‌డీఏ

రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అధ్యయనం కోసం కన్సల్టెంట్‌ను నియమించాం. ఆ మార్గం ఎలా ఉండాలి?, ఎటువైపు తీసుకువెళ్లాలి?...అనే అంశాలపై నివేదిక వస్తుంది. దాని ప్రకారం డీపీఆర్‌ తయారుచేస్తాం. ఇది త్వరగానే కార్యరూపంలోకి వస్తుంది.

25 ఏళ్లలో శ్రీకాకుళం కూడా కలుస్తుంది

పీవీఎన్‌ మాధవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఒక స్ట్రిప్‌ కింద అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే సెమీ రింగ్‌ రోడ్డు ప్రతిపాదించారు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 25 ఏళ్లలో శ్రీకాకుళం కూడా వీటితో కలిసిపోనుంది.

Updated Date - Nov 09 , 2025 | 01:09 AM