Share News

భవిష్యత్తు సిటీగా విశాఖ

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:24 AM

రాష్ట్రానికి విశాఖపట్నం భవిష్యత్తు సిటీగా మారబోతుందని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

భవిష్యత్తు సిటీగా విశాఖ

ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు రాక

యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కష్టపడుతున్నాం

నమో అంటే నాయుడు, మోదీ

అన్ని రంగాల్లో అగ్రస్థానంలో రాష్ట్రం

ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌

ఎండాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రానికి విశాఖపట్నం భవిష్యత్తు సిటీగా మారబోతుందని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు పెద్దఎత్తున ఉద్యోగ కల్పన కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విశాఖలో ప్రముఖ ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండాడలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్య్లూటీసీ) నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. తాను రెండోసారి ఐటీ శాఖా మంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌ దూసుకుపోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. విశాఖలో త్వరలో 30 వేల ఉద్యోగాలు వస్తున్నాయని, గూగుల్‌ సంస్థను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించిందన్నారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌తో పాటు ప్రపంచంలో ప్రముఖ సంస్థలన్నీ విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని, యువతకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయన్నారు.

పారిశ్రామికీకరణ దిశగా...

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. నమో అంటే నాయుడు, మోదీ అనేలా డబుల్‌ ఇంజన్‌ సర్కారు బుల్లెట్‌లా దూసుకుపోతోందన్నారు. ఎన్నికల్లో తనకంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన నేతలు వేదికపైనే ఉన్నారని, పార్లమెంట్‌ పరంగా ఎంపీ భరత్‌ అత్యధిక మెజారిటీతో గెలిచారని, 2019 ఎన్నికల్లో ఏపీలో ఓటమి చూసిన విశాఖ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారని, వారి అభిమానానికి తగ్గట్టుగా అభివద్ధి చేసి చూపిస్తామన్నారు.

అన్ని రంగాల్లో అగ్రపథం

అన్ని రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ను ఎలా తీర్చిదిద్దారో రాష్ట్రాన్ని కూడా నూతన శకం వైపు నడిపిస్తారన్నారు. వచ్చే ఏడాదికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, దీంతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుందన్నారు.

లోకేశ్‌ అవిరళ కృషి: ఎంపీ శ్రీభరత్‌

విశాఖకు అనేక పారిశ్రామిక, ఐటీ సంస్థలు రావడంలో మంత్రి లోకేశ్‌ కృషి చాలా ఉందని, ఆయన కష్టంతో ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు లభించడం ఆనందించదగిన విషయమని ఎంపీ ఎం.శ్రీభరత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోందని, గూగుల్‌ లాంటి దిగ్గజ సంస్థను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నేత లోకేశ్‌కే సాధ్యమయిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమ్మిట్‌ పెట్టి అప్పడాల హబ్‌, మటన్‌ మార్టులు, చేపల దుకాణాలు తీసుకువస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు వస్తున్నాయన్నారు.

మంత్రికి ఐటీ సంస్థల కృతజ్ఞతలు

గత ప్రభుత్వంలో రావాల్సిన ఇంటెన్సివ్‌లను చెల్లించడంలో మంత్రి లోకేశ్‌ కీలకపాత్ర పోషించారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఐటీ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖలో ఐటీ రంగం లోకేశ్‌ కృషితో అగ్రపథాన దూసుకుపోతుందనే నమ్మకం కలుగుతోందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌, విశాఖ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, డబ్ల్యూటీసీ డైరెక్టర్‌ వంశీకృష్ణ, స్థానిక నాయకులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 01:24 AM