Share News

నంబర్‌వన్‌గా విశాఖ

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:53 AM

విశాఖ అంటేనే ప్రశాంతతకు మారుపేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబునిచ్చారు.

నంబర్‌వన్‌గా విశాఖ

  • టెక్నాలజీ హబ్‌గా నగరం

  • పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం

  • ఇక్కడకు వస్తే కొత్త ఉత్సాహం వస్తుంది

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

  • మహిళలకు సురక్షిత నగరంగా గుర్తింపు పొందడం ఏపీకి గర్వకారణం

  • బీచ్‌రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి

  • నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ అంటేనే ప్రశాంతతకు మారుపేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబునిచ్చారు. నగరవాసులంతా మంచిమనస్సు కలిగినవారన్నారు. ఒకవైపు సముద్రం...మరోవైపు కొండలు కలిగిన విశాఖ వస్తే తనకు కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. భవిష్యత్తులో విశాఖను దేశంలోనే నంబర్‌వన్‌ నగరంగా అభివృద్ధి చేస్తానన్నారు. బీచ్‌రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ గుర్తింపు పొందడం ఏపీకి గర్వకారణమన్నారు. నగరానికి బీచ్‌ పెద్ద అడ్వంటేజ్‌ అని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దీనివల్ల పర్యాటకం అభివృద్ధి చెంది అందరికీ మంచి జరుగుతుందన్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్సు బీచ్‌రోడ్డులో ఉన్న 14 సందర్శనీయ ప్రాంతాలను కలుపుతుంది కాబట్టి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.

భవిష్యత్తులో విశాఖ టెక్నాలజీ హబ్‌గా తయారుకాబోతోందని, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఎంతోమంది నగరానికి వలసవచ్చే పరిస్థితి ఉంటుందని చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖను రాజధాని చేస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే...అవసరం లేదని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ నగరవాసులు తమ తీర్పును గత ఎన్నికల్లో ఇచ్చారని చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో చాలాచోట్ల టీడీపీ ఓటమి పాలైనాసరే విశాఖ నగరంలోని అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. అది పార్టీపై, తనపై నగరవాసులకు ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. విశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.

Updated Date - Aug 30 , 2025 | 01:53 AM