వైరస్‌ను తట్టుకునే చెరకు రకాలను రూపొందించాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:48 AM
పసుపు ఆకు వంటి వైరస్‌లను తట్టుకొనేలా మేలైన చెరకు రకాలను రూపొందించాలని అఖిల భారత చెరకు సమన్వయ పరిశోధనా పథకం (ఏఐఎస్‌సీఆర్‌పీ) పరిశీలకులు, స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలను కోరారు.
ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలకు ఏఐఎస్‌సీఆర్‌పీ పరిశీలకుల సూచన
అనకాపల్లి అగ్రికల్చర్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పసుపు ఆకు వంటి వైరస్‌లను తట్టుకొనేలా మేలైన చెరకు రకాలను రూపొందించాలని అఖిల భారత చెరకు సమన్వయ పరిశోధనా పథకం (ఏఐఎస్‌సీఆర్‌పీ) పరిశీలకులు, స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలను కోరారు. సమన్వయ పరిశోధన పథకం పరిశీలకులు డాక్టర్ డి.శశికుమార్, డాక్టర్ వి.చంద్రశేఖర్, డాక్టర్ ఎస్.కె.యాదవ్, డాక్టర్ అనిల్‌కుమార్‌ల బృందం గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. సమన్వయ పరిశోధన పథకం కింద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో వీరు సమావేశమయ్యారు. పరిశోధనలపై మూల్యాంకనం నిర్వహించారు. తెగుళ్లను, వైరస్‌లను తట్టుకొని, అధిక దిగుబడులు సాధించే చెరకు రకాలపై పరిశోధనలు ముమ్మరం కావాలని సూచించారు. చెరకు పరిశోధన క్షేత్రాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జరుగుతున్న చెరకు పరిశోధనల ప్రగతిని వీరు సమీక్షించారు. వివిధ వాతావరణ వ్యవసాయ జోన్‌లలో చెరకు ఉత్పత్తి, పంట సంరక్షణ కార్యక్రమాలను వివరించారు. వీరి వెంట ఏడీఆర్ డాక్టర్ సిహెచ్.ముకుందరావు, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ డి.ఆదిలక్ష్మి, డాక్టర్ బి.భవాని, తదితరులు వున్నారు.