రాయిపాడులో వైరల్ జ్వరాలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:44 AM
మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు రాయిపాడు గిరిజన గ్రామంలో వైరల్ జ్వరాలు విజృంభించాయి.
ప్రతి ఇంటిలో ఒకరిద్దరు బాధితులు
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనుల వినతి
రావికమతం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు రాయిపాడు గిరిజన గ్రామంలో వైరల్ జ్వరాలు విజృంభించాయి. వాతావరణంలో మార్పులు, వర్షాలు కురుస్తుండడంతోపాటు తాగునీటి వనరులు కలుషితం కావడంతో ప్రతి ఇంటిలో ఒకరిద్దరు జ్వరాలబారిన పడ్డారు. గ్రామంలో మొత్తం 80 మంది జనభా వుండగా గెమ్మిలి అనిత, చిక్కిలి అంజలి, గెమ్మిలి గంగ, గెమ్మిలి చిలకమ్మ, సీదిరి ఎరికినాయుడు, పాంగి రామారావు, తదితరులు తీవ్రజ్వరంతో బాధపడుతున్నారు. ఏఎన్‌ఎం వచ్చి మందులు ఇచ్చినప్పటికీ జ్వరాలు తగ్గలేదు. ఓపికతోపాటు స్థోమత ఉన్న వారు కొత్తకోటలో ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. మిగిలిన వార ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ జ్వరాలు తగ్గడంలేదని బాధితులు వాపోతున్నారు. జ్వరంతోపాటు కాళ్లు, చేతులు పట్టేస్తున్నాయని, మంచంలో నుంచి లేచే ఓపిక కూడా ఉండడంలేదని చెబుతున్నారు. తక్షణమే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా కొండ శిఖరంపై ఉన్న చలిసింగం గ్రామంలో కూడా సుమారు 30 మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలిసింది. వీరిలో కొంతమంది నర్సీపట్నంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినట్టు గ్రామస్థులు తెలిపారు.