ఎలమంచిలిలో వైరల్ జ్వరాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:18 AM
మునిసిపాలిటీలోని గొల్లలపాలెం వార్డులో వైరల్ జ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంటిలో కనీసం ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు జ్వర బాధితులు వున్నారు. సుమారు పక్షం రోజుల క్రితం వైరల్ జ్వరాలు మొదలవ్వగా, క్రమేపీ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో వైద్య సేవల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కడుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని వార్డులో చేర్చి, వైద్య సేవలు అందిస్తున్నారు.
గొల్లలపాలెం ప్రాంతంలో పలువురు బాధితులు
సీహెచ్‌సీకి జ్వర పీడితుల తాకిడి
వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వినతి
ఎలమంచిలి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని గొల్లలపాలెం వార్డులో వైరల్ జ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంటిలో కనీసం ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు జ్వర బాధితులు వున్నారు. సుమారు పక్షం రోజుల క్రితం వైరల్ జ్వరాలు మొదలవ్వగా, క్రమేపీ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో వైద్య సేవల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కడుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని వార్డులో చేర్చి, వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిలిన వారికి మందులు ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. శుక్రవారం గొల్లలపాలేనికి చెందిన జ్వరబాధితులతో సీహెచ్‌సీలో కిటకిటలాడింది. కాళ్లు, చేతులు పీకుతున్నాయని, వారం రోజుల వరకు జ్వరం తగ్గడం లేదని బాధితులు అంటున్నారు. కొళాయి ద్వారా సరఫరా చేసే నీరు బుదరగా వుండడంతో తాగునీటి కోసం చేతిబోర్లును ఆశ్రయిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. కాగా గొల్లలపాలెంతోపాటు పెదపల్లి, మంత్రిపాలెం ప్రాంతాల్లో కూడా వైరల్ జ్వరాలు ప్రబలాయని స్థానికులు చెబుతున్నారు. మునిసిపల్, వైద్య, ఆరోగ్య శాఖ అఽధికారులు వెంటనే స్పందించి గొల్లలపాలెంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.