రాయి క్వారీలో నిబంధనల పాతర
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:39 AM
మండలంలోని రాజన్నపేట సమీపంలో వున్న రాయి క్వారీ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కొండపై పెద్ద ఎత్తున బోరు బ్టాస్టింగులు నిర్వహిస్తున్నారు. భారీ పేలుళ్ల ధాటికి సమీపంలోని ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. పేలుళ్లు జరిపే సమయంలో భూకంపం వచ్చిందన్నట్టు ప్రకంపనలు వస్తున్నాయి. పేలుళ్ల ధాటికి బండరాళ్లు వచ్చి గ్రామంపై పడుతున్నాయి. పెద్దఎత్తున దుమ్ము, ధూళి ఎగిసిపడుతుండడంతో ప్రజలు, పంటలు కాలుష్యం బారిన పడుతున్నాయి. క్వారీ సమస్యపై సుమారు నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
బండరాళ్ల కోసం బోరు బ్లాస్టింగులు జరుపుతున్న నిర్వాహకులు
కంపిస్తున్న రాజన్నపేట గ్రామం
బీటలు వారుతున్న ఇళ్ల గోడలు, దెబ్బతింటున్న శ్లాబులు
ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో రోగాలబారిన గ్రామస్థులు
సాగుకు పనికిరాకుండా పోతున్న పంట పొలాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
రోలుగుంట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని రాజన్నపేట సమీపంలో వున్న రాయి క్వారీ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కొండపై పెద్ద ఎత్తున బోరు బ్టాస్టింగులు నిర్వహిస్తున్నారు. భారీ పేలుళ్ల ధాటికి సమీపంలోని ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. పేలుళ్లు జరిపే సమయంలో భూకంపం వచ్చిందన్నట్టు ప్రకంపనలు వస్తున్నాయి. పేలుళ్ల ధాటికి బండరాళ్లు వచ్చి గ్రామంపై పడుతున్నాయి. పెద్దఎత్తున దుమ్ము, ధూళి ఎగిసిపడుతుండడంతో ప్రజలు, పంటలు కాలుష్యం బారిన పడుతున్నాయి. క్వారీ సమస్యపై సుమారు నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని శరభవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 216, 231, 232లలో రాజన్నపేట గ్రామానికి సమీపంలో కొండ వుంది. ఇక్కడ రాయి తవ్వకాల (మైనింగ్) కోసం ఏకా వీర్రాజు అనే వ్యక్తి పేరు మీద గనుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. వేరే వ్యక్తులు లీజుకు తీసుకుని క్వారీ నిర్వహిస్తున్నారు. రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ నేవల్ బేస్ (ఎన్‌ఏవోబీ) పనులకు ఇక్కడి కారీ నుంచి భారీ బండరాళ్లను తరలిస్తున్నారు. ఇందుకోసం క్వారీలో పలుచోట్ల 50-60 అడుగుల లోతున యంత్రాలతో రంధ్రాలు చేసి, వాటిల్లో జిలెటిన్ స్టిక్స్‌ను అమర్చి ఏకకాలంలో పేలుళ్లు (బోరు బ్లాస్టింగులు) నిర్వహిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర నుంచి క్వారీలో రాయి తవ్వకాలు జరుగుతున్నాయి. పేలుళ్ల ధాటికి రాజన్నపేట గ్రామం కంపించిపోతున్నది. పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. పేలుళ్ల సమయంలో దుమ్ము, ధూళి ఎగిసి నివాసాలు, పంట పొలాలపైకి వస్తున్నది. దీంతో పలువురు శ్వాసకోశ సంబంధ వ్యాధులబారిన పడ్డారు. పొలాల్లో పంటలపై తెల్లటి బూడిదలా పేరుకుపోయి, దిగుబడులు తగ్గిపోతున్నాయి. క్వారీకి సమీపంలో వున్న పొలాలు పంటల సాగుకు పనికిరాకుండా పోయాయి. సమస్య నానాటికీ తీవ్రతరం అవుతుండడంతో ఇటీవల క్వారీ వద్దకు వెళ్లి బండరాళ్లను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. గత గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా చేశారు. మరుసటి రోజు జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌రాజు రాజన్నపేట వెళ్లి గ్రామస్థులతో కలిసి రాయి క్వారీని పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరుపుతున్నందుకు క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది
తేలు సత్యవతి, పి.చిలుకమ్మ, రాజన్నపేట
మా ఊరుకు సమీపంలో వున్న రాయి క్వారీ వల్ల రోజూ ఇబ్బందులు పడుతున్నాం. భారీ శబ్దాలు వచ్చేలా బోరు బ్లాస్టింగులు జరుపుతున్నారు. దీంతో ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయి. ఇళ్లు కూలిపోతాయేమోనని భయంగా వుంది. పంట పొలాల్లో దుమ్ము, ధూళి పేరుకుపోయి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. క్వారీ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
నాగమ్మ, తహశీల్దారు, రోలుగుంట
రాజన్నపేట సమీపంలోని క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తుండడంతో ఇళ్లకు, పంటలకు నష్టం వాటిల్లుతున్నదని, సదరు క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామాస్థులు ఇటీవల ఫిర్యాదు చేశారు. క్వారీ వద్దకు వెళ్లి పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు నిర్ధారణ అయితే క్వారీ నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.