Share News

టికెట్ల లెక్కలపై విజిలెన్స్‌

ABN , Publish Date - May 09 , 2025 | 01:28 AM

సింహాచలం చందనోత్సవం జరిగి వారం రోజులు దాటిన తరువాత కూడా దేవస్థానం అధికారులు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

టికెట్ల లెక్కలపై విజిలెన్స్‌

  • చందనోత్సవం కోసం ఎన్ని ముద్రించారు?, ఎవరికి ఇచ్చారనే వివరాలు సేకరణ

  • వైసీపీ కార్యకర్తకు రూ.వేయి టికెట్లు 63 జారీ

  • సేవ సంస్థల పేరుతో 400 వెహికల్‌ పాస్‌లు తీసుకున్న దేవస్థానం అధికారులు

  • 40 పంపిణీ చేసి మిగిలినవి అమ్ముకున్న సిబ్బంది

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం చందనోత్సవం జరిగి వారం రోజులు దాటిన తరువాత కూడా దేవస్థానం అధికారులు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉత్సవంలో ఏడుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ జరిగిన వ్యవహారాలపై అన్ని కోణాల్లోను వివరాలు సేకరిస్తోంది. అందులో ప్రధానంగా టికెట్ల ముద్రణ, పంపిణీ, విక్రయాల వ్యవహారం చాలా వివాదాస్పదమైంది.

ఉత్సవం బుధవారం జరుగుతుందనగా మంగళవారం రాత్రి వరకూ ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. ఆ రోజు రాత్రి 11.30 గంటల వరకూ టిక్కెట్లు ముద్రిస్తూనే ఉన్నారు. పంచుతూనే ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మనుషులు కూడా ఈఓ కార్యాలయం ముందు పడిగాపులు కాశారు. ఎప్పుడూ ఇలా జరగలేదని ఈసారి దేవదాయ శాఖ కమిషనర్‌, ఇన్‌చార్జి ఈఓ వారికి నచ్చినట్టు వ్యవహరించారని వారు విజయవాడలో ఫిర్యాదు చేశారు. దాంతో టికెట్ల లెక్కలపై విజిలెన్స్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

వైసీపీ కార్యకర్తకు అన్ని టిక్కెట్లా..?

దాతలకు కూడా ఈసారి టికెట్లు సరిగా ఇవ్వలేదు. సింహాచలంలో ఉండే వైసీపీ కార్యకర్త కశిరెడ్డి కాశీకి మాత్రం ఈఓ కార్యాలయం రెండు స్లాట్ల ద్వారా వేయి రూపాయల టికెట్లు 63 మంజూరుచేసినట్టు అధికారుల దృష్టికి వెళ్లింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే అన్ని టికెట్లు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తకు ఎలా ఇచ్చారని ఆరా తీస్తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో టికెట్లు తీసుకున్న వారి వివరాలు కూడా పరిశీలిస్తున్నారు.

వెహికల్‌ పాస్‌లు అమ్ముకున్నారు

అంతకు ముందు ఏడాది ఘాట్‌ రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ అయిపోయి భక్తులు కాలినడకన రాకపోకలు సాగించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొండపైకి పరిమితంగా అంటే కేవలం 150 వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. ఆ విధంగానే ఎవరికీ వెహికల్‌ పాస్‌లు ఇవ్వలేదు. అయితే దేవస్థానం అధికారులు మాత్రం కొండపై సేవలు అందించే సంస్థలు ఉన్నాయని, వారు ప్రసాదాలు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తాయని వాటికి పాస్‌లు అవసరమని 400 తీసుకున్నారు. వాటిలో కేవలం 40 పాస్‌లు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చి, మిగిలిన పాస్‌లను, అడ్డగోలుగా దక్కించుకున్న వేయి రూపాయలు, రూ.1,500 టికెట్లను కొందరు అధికారులు అధిక ధరలకు అమ్ముకొని జేబులు నింపుకొన్నారు. ఈ విషయం ఇప్పటివరకూ ఎక్కడా బయటకు పొక్కలేదు. దేవస్థానం ఉద్యోగులు కొందరు వేయి రూపాయల టికెట్లు ఒక్కొక్కటి రూ.2 వేలు చొప్పున అమ్ముకున్నారని తెలిసింది గానీ వెహికల్‌ పాస్‌లు అమ్ముకున్న విషయం బయటకు రాలేదు. దీనిపై కూడా విచారణ చేస్తే కొండపై దొంగలు ఎవరో రంగు బయటపడుతుంది.

సింహాచలం ప్రమాదంపై ముగ్గురికి సస్పెన్షన్‌ నోటీసులు

ఇంకో నలుగురికి అందని ఉత్తర్వులు

విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనకు సంబంధించి సస్పెండైన అధికారుల్లో ముగ్గురికి మాత్రమే గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన నలుగురికి ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రమాదం ఏప్రిల్‌ 30వ తేదీన జరగ్గా ఆరోజే ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ మూడు రోజులు విచారణ చేసి నివేదికను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సమర్పించింది. అదేరోజు ఈ ఘటనకు ఏడుగురు అధికారులను బాఽధ్యులుగా పేర్కొంటూ సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ముగ్గురిపై క్రిమినల్‌ చర్యలకు కూడా సిఫారసు చేశారు. అయితే మూడు రోజుల తరువాత గురువారం సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ కె.సుబ్బారావు, ఏపీటీడీసీలో పనిచేస్తున్న ఈఈ కె.రమణ, డీఈ ఏఆర్‌వీఎల్‌ఆర్‌ స్వామిలకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ (విశాఖపట్నం) దాటి బయటకు వెళ్లవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన నలుగురు ఇంజనీర్లకు ఇంకా ఉత్తర్వులు అందలేదు. వీరిలో దేవస్థానానికి చెందిన ఇంజనీర్లు డీజీ శ్రీనివాసరాజు (ఈఈ), కేఎస్‌ఎన్‌ మూర్తి(డీప్యూటీ ఈఈ), కె.బాబ్జీ(జేఈ)లతో పాటు ఏపీటీడీసీకి చెందిన పి.మదన్‌మోహన్‌(ఏఈ) ఉన్నారు.

వారిపై విచారణ ఏదీ...?

సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగంలో చాలామంది అర్హతలు లేకుండా ఇంజనీర్లుగా కొనసాగుతున్నారని, మరికొందరు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందారంటూ దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులే రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై గత దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలువురు ఇంజనీరింగ్‌ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. ఇప్పటివరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఇంజనీరింగ్‌ విభాగం అంతా గందరగోళంగా ఉందని, అర్హతలు లేనివారు కొనసాగుతున్నారని, నిర్మాణాల్లో నాణ్యతాప్రమాణాలు లేవని ప్రభుత్వమే గుర్తించిన నేపథ్యంలో ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా తప్పు చేసిన వారిని రక్షించే కార్యక్రమాలకు స్వస్తి పలికి తగిన చర్యలు తీసుకోవలసి ఉంది.

Updated Date - May 09 , 2025 | 01:29 AM