ఎరువుల దుకాణలపై విజిలెన్స్
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:45 AM
రసాయన ఎరువులను బ్లాక్ చేసి, తెరచాటున ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు అందిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించారు.
కె.కోటపాడు మండలం సంతపాలెంలో అనుమతి లేకుండా ఎరువుల అమ్మకాలు
విజిలెన్స్, వ్యవసాయ శాఖల అధికారుల దాడులు
వివిధ రకాలకు చెందిన 620 బస్తాల నిషేధిత ఎరువులు సీజ్
వ్యాపారిపై కేసు నమోదు
జిల్లాలో ఎరువుల షాపులు, గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు
అనకాపల్లి/ కె.కోటపాడు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):
రసాయన ఎరువులను బ్లాక్ చేసి, తెరచాటున ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు అందిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు స్పందించారు. జిల్లాలో ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖల అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఎరువులు విక్రయించడంతోపాటు నిషేధిత ఎరువులు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఎరువులను సీజ్ చేసి, దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
జిల్లాలో కొద్ది రోజుల నుంచి సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో పొలాల్లో దమ్ము పనులు, వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ సమయంలో రైతులు తప్పకుండా రసాయన ఎరువులు వినియోగిస్తారు. దాదాపు 80 శాతం మంది రైతులు ప్రస్తుతం వరినాట్లు వేస్తుండడంతో రసాయన ఎరువులకు గిరాకీ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు కృత్రిమంగా ఎరువుల కొరతను సృష్టించి, బ్లాకులో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మరికొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌వాయిస్‌లు లేకుండా, నిషేధ ఎరువులను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వీటిపై రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిందట చోడవరంలోని శ్రీలక్ష్మీదేవి ఎరువుల దుకాణంలో ఒక కంపెనీకి చెందిన తక్కువ ధర ఎరువులను, అదే కంపెనీకి చెందిన ఎక్కువ ధర గల ఎరువుల సంచుల్లోకి మార్చి రైతులను మోసగిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తాజాగా కె.కోటపాడు మండలం కె.సంతపాలెంలోని గాయత్రి ఎరువుల దుకాణంలో వ్యవసాయాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ లక్షలాది రూపాయల విలువచేసే నిషేధిత, నకిలీ ఎరువులను గుర్తించారు. ఎన్‌పీకే 17-17-17 రకం ఎరువు 200 బస్తాలు, ఎన్‌పీకే 19-19-19 రకం ఎరువు 220 బస్తాలు, ఎంఓపీ ఎరువు 60 బస్తాలు, 20-20-20 రకం ఎరువు 60 బస్తాలు, భూశక్తి ఎరువు 60 బస్తాలు మొత్తం 620 బస్తాలను సీజ్‌చేశారు. వీటి విలువ రూ.8.42 లక్షలు వుంటుందని, ఈ ఎరువులను దుకాణదారుడు హైదరాబాద్‌లోని వెంకటేశ్వర ఆగ్రోస్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, ఇక్కడకు రప్పించినట్టు అధికారుల విచారణలో తేలింది. ఎరువుల దుకాణం నిర్వాహకుల్లో కింతాడ హరీశ్‌పై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ఎరువుల బస్తాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ టి.అప్పలనాయుడు, ఎస్‌ఐ రవికుమార్, వ్యవసాయ అధికారి ఎంవీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి జిల్లాలో ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్టు రుజువైతే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.