ఆర్‌ఈసీఎస్‌లో అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:26 AM
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్)లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు.
శాసనసభలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డిమాండ్
కశింకోట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్)లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ, అవినీతిని నివారించాలనే ఉద్దేశంతో 2021లో ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌కు అప్పగించారని, కానీ అవినీతి మాత్రం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నికల్ కళాశాలలో ఉన్న రూ.3 కోట్ల నిధులను అప్పట్లో ఈపీడీసీఎల్‌కు అప్పగించారని, కానీ గత ఎనిమిది నెలల నుంచి కళాశాల ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. మరోవైపు ఆర్‌ఈసీఎస్‌లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. ఆర్‌ఈసీఎస్‌ను సహకార సంస్థగా లేదంటే పూర్తిగా ఈపీడీసీఎల్ ఆధీనంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.