కునారిల్లుతున్న పశు వైద్యం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:38 AM
జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, పశు వైద్యుల సేవలు గుర్తించుకునేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం ‘ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని రెండున్నర దశాబ్దా నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశు సంరక్షణ, వైద్య సేవలపై అవగాహన సదస్సుల నిర్వహణ, పశు సంక్షేమంపై దృష్టి పెట్టడం దీని ప్రధాన లక్ష్యం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పశు వైద్య సేవలు చాలా కీలకం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనుషుల ఆరోగ్యం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని పశు వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతటి కీలమైన పశు సంవర్థక శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది.
ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
జిల్లాలో 13 మంది ఏడీస్థాయి డాక్టర్లకు.. ప్రస్తుతం ఉన్నది ఆరుగురే!
19 వెటర్నరీ అసిస్టెంట్, 59 సహాయకుల పోస్టులు ఖాళీ
శిథిలావస్థలో డిస్పెన్సరీల భవనాలు
ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతు పనులు
సదుపాయాలు, సిబ్బంది కొరతతో వైద్యుల అవస్థలు
నేడు ప్రపంచ పశు వైద్య దినోత్సవం
నర్సీపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, పశు వైద్యుల సేవలు గుర్తించుకునేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం ‘ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని రెండున్నర దశాబ్దా నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశు సంరక్షణ, వైద్య సేవలపై అవగాహన సదస్సుల నిర్వహణ, పశు సంక్షేమంపై దృష్టి పెట్టడం దీని ప్రధాన లక్ష్యం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పశు వైద్య సేవలు చాలా కీలకం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనుషుల ఆరోగ్యం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని పశు వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతటి కీలమైన పశు సంవర్థక శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. పశువైద్యశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే వుంటున్నాయి. జిల్లాలో అత్యధిక పశువైద్య కేంద్రాలను శిథిల భవనాల్లో నిర్వహిస్తున్నారు. అధికారులు, సిబ్బంది కొరతతో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వెటర్నరీ డాక్డర్లు విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు.
అనకాపల్లి జిల్లాలో 13 సబ్ డివిజన్ స్థాయి పశువుల ఏరియా ఆస్పత్రులు, 60 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. సబ్ డివిజన్ వెటర్నరీ ఆస్పత్రిలో ఏడీ స్థాయి పశు వైద్యులు విధులు నిర్వహిస్తారు. జిల్లాలో దాదాపు సగం ఏడీ పోస్టులు ఖాళీగా వున్నాయి. కోటవురట్ల ఆస్పత్రిలో ఏడీ పోస్టు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. 13 మంది ఏడీలకుగాను ప్రస్తుతం ఆరుగురు మాత్రమే వున్నారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో 19 వెటర్నరీ అసిస్టెంట్లు, అన్ని ఆస్పత్రుల్లో 59 ఆఫీస్ సబార్డినేట్ (సహాయకులు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశువులకు వైద్యం చేసేటప్పుడు వాటిని పట్టుకోవడానికి, నేలపై పడుకోబెట్టడానికి సబార్డినేట్‌లు అవసరం. సహాయ సిబ్బంది లేని ఆస్పత్రుల్లో వారు చేయాల్సిన పనులను కూడా పశు వైద్యులే చేసుకోవాల్సి వస్తున్నది. అయితే సచివాలయాల్లోని సహాయ పశు వైద్య సిబ్బంది, గోపాల మిత్రలు సేవలు అందిస్తుండడంతో కొంత వరకు సిబ్బంది కొరత నుంచి ఉపసమనం కలుగుతున్నది. జిల్లాలో 59 పశు వైద్యశాలలకు మరుగుదొడ్లు లేవు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది.. ప్రధానం మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్ డివిజన్ స్థాయి పశు వైద్యశాల్లో ఆపరేషన్ థియేటర్లు, మీటింగ్ హాళ్లు లేవు. ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో పశువులకు, జీవాలకు ఆరుబయట శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తున్నది. జిల్లాలో 45 వెటర్నరీ ఆస్పత్రులను పురాతన భవనాల్లో నడుపుతున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. ఏటా నిధుల కోపం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, అవి బుట్టదాఖలు కావడం అనవాయితీగా వస్తున్నది. గతంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ నుంచి పశువైద్యశాలల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యేవి. కొన్నేళ్ల నుంచి ఈ సంస్థ నిధులు మంజూరు చేయడం లేదు.