Share News

నేలబావిలో పడి పశువైద్యుడి మృతి

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:23 AM

మండలంలోని సంతపాలెం సమీపంలో ప్రమాదవశాత్తూ నేలబావిలో పడి వెటర్నరీ డాక్టర్‌ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన వివరాలిలావున్నాయి.

నేలబావిలో పడి పశువైద్యుడి మృతి
పీలా కొండలరావు ( ఫైల్‌ఫొటో)

కె.కోటపాడు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సంతపాలెం సమీపంలో ప్రమాదవశాత్తూ నేలబావిలో పడి వెటర్నరీ డాక్టర్‌ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన వివరాలిలావున్నాయి. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన పీలా కొండలరావు (32) విశాఖ డెయిరీలో పశువుల డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కె.కోటపాడులో భార్య, పిల్లలతో నివాసం ఉంటూ మండల పరిధిలో విశాఖ డెయిరీ సభ్యరైతులకు చెందిన ఆవులు, గేదెలకు వైద్య సేవలు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కె.సంతపాలెం సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తూ కాలుజారి నేల బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటమునిగి గల్లంతయ్యాడు. ఎంతసేపైనా భర్త ఇంటికి రాకపోవడంతో ఫోన్‌ చేసింది. కానీ స్పందించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కొండలరావు సోదరుడు అప్పలనాయుడు గాలింపు చర్యలు చేపట్టగా, కె.సంతపాలెం వద్ద మోటార్‌ సైకిల్‌ కనిపించింది. సమీపంలో వున్న నేలబావిలో పరిశీలించగా కొండలరావు మృతదేహం నీటిపై తేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఎస్‌ఐ ధనుంజయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:23 AM