ఉపమాకలో కన్నుల పండువగా వెంకన్న కల్యాణం
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:34 AM
ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వివిధ ఘట్టాలను ఆలయ ఆచార వ్యవహారాల మేరకు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించిన అర్చకులు
గోవిందనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
భక్తులతో కలిసి కల్యాణోత్సవాన్ని తిలకించిన హోం మంత్రి అనిత
నక్కపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వివిధ ఘట్టాలను ఆలయ ఆచార వ్యవహారాల మేరకు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కల్యాణ వేడుకను కనులారా తిలకించి, భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
వేంకటేశ్వరస్వామి కల్కీ అవతారంలో కొలువైన ఉపమాక క్షేత్రం శ్రీవారి వార్షిక కల్యాణశోభతో కళకళలాడింది. సోమవారం రాత్రి ఎదురుసన్నాహ మహోత్సవంలో భాగంగా ఉపమాక మాఢవీధుల్లో సింహాద్రాచార్యులు ఇంటి వద్ద పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి కల్యాణం జరిగే తీరును ప్రముఖ వేదపండితురాలు డాక్టర్ గాయత్రీదేవి కళ్లకు కట్టినట్టు వివరించారు. హోం మంత్రి అనితతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని అద్యంతం తిలకించారు. ఎదురు సన్నాహ మహోత్సవం అనంతరం అర్ధరాత్రి 12.30 గంటలకు వేంకటేశ్వరస్వామి రథోత్సవం ప్రారంభమైంది. తొలుత రథంలో స్వామివారిని అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణతో మాఢవీధుల్లో స్వామివారి రథాన్ని ఊరేగించారు.
రథోత్సవం అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి ఉభయ దేవేరులతోపాటు వేంకటేశ్వరస్వామిని తోడ్కొని వచ్చారు. ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి గోపాలాచార్యులు, రాజగోపాలచార్యులు, పవన్‌కుమార్ వేదమంత్రోచ్ఛరణలు, చతుర్వేద పఠనంతో అర్ధరాత్రి 2.15 గంటల నుంచి తెల్లవారుజామున 4.15 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగింది. హోం మంత్రి అనిత, కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణాన్ని తిలకించారు.