గోతుల్లో కూరుకుపోయిన వాహనాలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:42 AM
వడ్డాది-పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్- డి.సురవరం మధ్య రోడ్డుపైన వున్న గుంతల్లో మంగళవారం ఉదయం రెండు వాహనాలు, సాయంత్రం ఒక వాహనం దిగబడిపోయాయి.
ట్రాఫిక్‌కు అంతరాయం
మాడుగుల రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వడ్డాది-పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్- డి.సురవరం మధ్య రోడ్డుపైన వున్న గుంతల్లో మంగళవారం ఉదయం రెండు వాహనాలు, సాయంత్రం ఒక వాహనం దిగబడిపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఘాట్‌రోడ్డు జంక్షన్ నుంచి సరుగుడు కర్రల లోడుతో ట్రాక్టర్, వడ్డాది వైపు నుంచి నుంచి సరుగుడు కర్రల లోడుతో వ్యాన్ వస్తున్నాయి. డి.సురవరం వద్ద రెండు వాహనాలు ఎదురుపడిన చోట రోడ్డుపై ఉన్న గోతుల్లో కూరుకుపోయాయి. ఇరుక్కుపోయిన వాహనాల యజమానులు ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చి, బయటకు లాగించారు. దీంతో సుమారు గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా సాయంత్రం ఐదు గంటల సమయంలో పాడేరు వెళుతున్న వ్యాన్ డి.సురవరం వద్ద అదే ప్రదేశంలో దిగబడిపోయింది. పక్క నుంచి స్థలం వుండడంతో వాహనాలు అతి కష్టంమీద రాకపోకలు సాగించాయి. ఎక్స్‌కవేటర్‌ను రప్పించి వ్యాన్‌ను బయటకు తీయించారు.