Share News

వాహనాల ఫిట్‌నెస్‌కు పాట్లు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:02 AM

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలకు ఒక్కటే ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) ఉండడం, అది కూడా సబ్బవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే ఒక రోజంతా వృథా అయినట్టేనని వాహనదారులు వాపోతున్నారు.

వాహనాల ఫిట్‌నెస్‌కు పాట్లు
సబ్బవరం సమీపంలోని ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌

- సబ్బవరంలోని ఆటోమేటెడ్‌ టెస్టిండ్‌ స్టేషన్‌కి వెళ్లాల్సిన పరిస్థితి

- గతంలో రవాణాశాఖ ఆఫీసుల వద్ద ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు మంజూరు

- ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి ఏటీఎస్‌ విధానం

- ఏఎస్‌ఆర్‌ జిల్లా, నర్సీపట్నం ఆర్టీవో పరిధిలో వాహనదారుల అవస్థలు

- అదనపు ఖర్చుకు తోడు రోజంతా వృథా అవుతోందని ఆటో డ్రైవర్ల ఆవేదన

- నర్సీపట్నం ఆర్టీవో పరిధిలో ఏటీఎస్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌

నర్సీపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలకు ఒక్కటే ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) ఉండడం, అది కూడా సబ్బవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే ఒక రోజంతా వృథా అయినట్టేనని వాహనదారులు వాపోతున్నారు.

ఆటోలు, కార్లు, ప్రైవేటు బస్సులు, స్కూల్‌ బస్సులు, లారీలు రోడ్డుపై తిరగాలంటే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. గతంలో రవాణా శాఖ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు వాహనాలను తనిఖీ చేసి మేన్యువల్‌ పద్ధతిలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసేవారు. అయితే మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి లేకుండా, పారదర్శకత కోసం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) విధానాన్ని తీసుకొచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాకు ఒక్కటే ఏటీఎస్‌ను నిర్వహిస్తున్నారు. సబ్బవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో హైవే పై ఇది ఉంది. ప్రైవేటు పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక యంత్ర పరికరాలతో వాహనాలను తనిఖీ చేసి ఫిట్‌నెస్‌ పాస్‌ లేదా ఫెయిల్‌ అని ధ్రువీకరిస్తారు. ఇది అనకాపల్లి ఆర్టీవో కార్యాలయం పరిధిలో ఉన్న 12 మండలాల వాహన యజమానులకు దగ్గరగా ఉండి వెళ్లి రావడానికి వెసులుబాటుగా ఉంటుంది. ఏఎస్‌ఆర్‌ జిల్లాలోని 22 మండలాలు, నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయం పరిధిలోని 12 మండలాల వాహన యజమానులకు ఏటీఎస్‌ దూరం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏఎస్‌ఆర్‌ జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వాహనదారులు సబ్బవరం వెళ్లాలంటే 120 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అలాగే నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్లాలంటే 100 కిలోమీటర్లు దూరం ఉంటుంది.

ఆటో డ్రైవర్ల ఇబ్బందులు

నర్సీపట్నం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం పరిధిలో 3,300 ఆటోలు, 792 మ్యాక్సీ క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు 82, స్కూల్‌ బస్సులు 190 ఉన్నాయి. మిగిలిన వాహన యజమానుల కంటే ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు వాహనం చెల్లుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువులో ఫిట్‌నెస్‌ చేయించుకోవాల్సి ఉంది. వాహనం కొనుగోలు చేసిన 8 సంవత్సరాల వరకు రెండేళ్లకు ఒకసారి, తరువాత ప్రతీ సంవత్సరం ఫిట్‌నెస్‌ చేయించాలి. దీని కోసం నర్సీపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజూ 100 ఆటోలు సబ్బవరం ఏటీఎస్‌కి వెళుతున్నట్టు డ్రైవర్లు చెబుతున్నారు. చలానాకి అయ్యే ఖర్చుతో పాటు అదనంగా మరో రూ.1500 ఖర్చు అవుతోందని వాపోతున్నారు. రోజంతా పని పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయం పరిధిలో ఒక ఏటీఎస్‌ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ మండలాలకు, నర్సీపట్నం చుట్టు పక్కల గ్రామాల వాహనదారులకు వెసులుబాటుగా ఉంటుందని ఆటో యజమానులు ఎన్‌.రాజు, ఎస్‌కే.అమీర్‌, ఆర్‌.దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jul 16 , 2025 | 01:02 AM