సిరులు కురిపిస్తున్న కూరగాయల సాగు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:34 PM
కూరగాయల పంటల సాగుపై రైతాంగం ఆసక్తి కనబరుస్తున్నది. తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ కష్టపడితే కూరగాయల సాగు సిరులు కురిపిస్తోందని రైతులు చెబుతున్నారు.
రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కుతున్న వైనం
ఆసక్తి చూపుతున్న అన్నదాత
పెరిగిన పంటల విస్తీర్ణం
పరవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కూరగాయల పంటల సాగుపై రైతాంగం ఆసక్తి కనబరుస్తున్నది. తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ కష్టపడితే కూరగాయల సాగు సిరులు కురిపిస్తోందని రైతులు చెబుతున్నారు.
పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న పరవాడ మండలంలో రైతులు ఇటీవల కూరగాయల పంటలపై దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో చాలా మంది కూరగాయల పంటపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కువగా వంగ, బెండ, బరబాటి, బీర, గోరుచిక్కుడు, టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు పోను మిగిలిన భూముల్లో ఎక్కువ శాతం మంది రైతులు వీటినే పండిస్తున్నారు. పండిన కూరగాయలను గాజువాక, సింధియా, పూర్ణామార్కెట్, స్టీల్‌ప్లాంట్, తదితర ప్రాంతాలకు ఆటోలు, వ్యాన్‌లలో తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. పరవాడ, వెన్నెలపాలెం, తానాం, గొర్లెవానిపాలెం, చినతాడి, పి. బోనంగి, వీఎల్‌ఎన్ పురం, రావాడ, ధర్మారాయుడుపేట, వాడచీపురపల్లి, నాయుడుపాలెం, హస్తనాపురం, మెట్టపాలెం, బండారుపాలెం, పెదముషిడివాడ, కన్నూరు, బొద్దపువానిపాలెం, కొత్తవెన్నెలపాలెం, స్వయంభూవరం, శృంగారపాడు, తదితర గ్రామాల్లో ఎక్కువగా కూరగాయల పంటలనే సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుతో ఆర్థికంగా లాభపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇంటిల్లిపాది కష్టపడితే నెలకు రూ.40 వేలు నుంచి రూ.50 వేల వరకు సంపాదించుకోవచ్చని అంటున్నారు. కూరగాయలకు డిమాండ్ కూడా అధికంగా ఉందని వారు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 150 హెక్టార్లపైనే కూరగాయల సాగు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కూరగాయల సాగు అధికంగా వుందని చెప్పాలి. మార్కెట్‌లో కూరగాయలకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం రైతులు కూరగాయల పంటలపైనే మక్కువ చూపుతున్నారు. దీంతో కూరగాయల విస్తీర్ణం ఊపందుకుంది.