Share News

ఆర్‌వీఎన్‌ఎల్‌ ఈడీగా వేగి రామునాయుడు

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:06 AM

రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) విశాఖపట్నం యూనిట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వేగి రామునాయుడు నియమితులయ్యారు.

ఆర్‌వీఎన్‌ఎల్‌ ఈడీగా వేగి రామునాయుడు

స్వస్థలం అనకాపల్లి జిల్లా కస్పా జగన్నాథపురం

విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) విశాఖపట్నం యూనిట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వేగి రామునాయుడు నియమితులయ్యారు. ఈయన స్వస్థలం అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని కస్పా జగన్నాథపురం. రామునాయుడు ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఈ) 1993 బ్యాచ్‌కు చెందిన అధికారి. రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణం, ఆర్‌వీఎన్‌ఎల్‌ ప్రాజెక్టుల పర్యవేక్షణ పనులను మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. గతంలో రామునాయుడు విశాఖపట్నం ఆర్‌వీఎన్‌ఎల్‌లో గ్రూపు జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మేజర్‌ ప్రాజెక్టులు, రైల్వే మౌలిక వసతుల పనులను చేపట్టారు. సంబల్‌పూర్‌-టిట్లాఘర్‌ రైల్వే లైన్‌ 182 కి.మీ. పొడవున విస్తరణ, ఖుర్దా రోడ్డులో ఎంఈఎంయు షెడ్‌ నిర్మాణం, విశాఖపట్నం వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్‌షాపు నిర్మాణం, సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు 12.25 కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం వంటి పనులు పర్యవేక్షించారు.


స్టీల్‌ ప్లాంటులో మళ్లీ పూల్‌ ఐరన్‌?

మూడు రోజుల్లో 2 వేల టన్నుల ఉత్పత్తి

అది ఇనుము కింద పరిగణన

స్టీల్‌ టన్ను రూ.50 వేలు

పూల్‌ ఐరన్‌కు అందులో సగం కూడా రాదని వాదన

ఉక్కు మంత్రిత్వశాఖ వద్దన్నా...ఎందుకు తయారుచేస్తున్నారో అర్థంకాని పరిస్థితి

విచారణకు సీఐటీయూ డిమాండ్‌

విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో యాజమాన్యం నిర్ణయాల కారణంగా రోజుకొక కొత్త వివాదం తలెత్తుతోంది. ఇప్పుడు తాజాగా ‘పూల్‌ ఐరన్‌’ వెలుగులోకి వచ్చింది. బ్లాస్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)లో తయారైన హాట్‌ మెటల్‌ను స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)నకు పంపించి, అక్కడ అవసరమైన కొన్ని పదార్థాలను జత చేసి స్టీల్‌గా మారుస్తారు. ఇది ఫినిష్డ్‌ ప్రొడక్ట్‌. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో తయారయ్యే హాట్‌ మెటల్‌ సెమీ ఫినిష్డ్‌ ప్రొడక్టు. దీనిని ఇనుము కిందనే పరిగణిస్తారు. ఎస్‌ఎంఎస్‌కి వెళ్లిన తరువాత బయటకు వచ్చేది మాత్రమే ‘స్టీల్‌’. దానికి మార్కెట్‌లో రేటు ఎక్కువ ఉంటుంది. హాట్‌ మెటల్‌ను వెంటనే వినియోగించుకోలేని పరిస్థితి ఉంటే దానిని అచ్చులుగా పోసి ‘పిగ్‌ ఐరన్‌’గా మారుస్తారు. దానిని బ్లాకులుగా అమ్ముతారు. అచ్చులుగా పోయకుండా హాట్‌ మెటల్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఇసుకలో పోస్తే...దానిని ‘పూల్‌ ఐరన్‌’ అంటారు. దీనిని తుక్కు కింద వ్యాపారులకు విక్రయిస్తారు. ఇలాంటి అమ్మకాల్లో వ్యాపారుల నుంచి యాజమాన్య ప్రతినిధులకు భారీ కమీషన్లు వస్తాయనే ప్రచారం ఉంది. అందుకని కొన్ని సందర్భాల్లో పూల్‌ ఐరన్‌ను తెర వెనుక నుంచి ప్రోత్సహిస్తారు. అయితే ఉక్కు మంత్రిత్వ శాఖ స్టీల్‌ప్లాంటులో పూల్‌ ఐరన్‌ ఉత్పత్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దాంతో గత నాలుగేళ్లుగా ఆ ప్రస్తావన లేదు. గత మూడు రోజుల నుంచి ప్లాంటులో తిరిగి పూల్‌ ఐరన్‌ తయారుచేస్తున్నారు. సీఐటీయూ ప్రతినిధి సీహెచ్‌ నరసింగరావు సమాచారం ప్రకారం...ఈ నెల రెండో తేదీన 300 టన్నులు, 3వ తేదీన 1,200 టన్నులు, 4వ తేదీన 600 టన్నులు పూల్‌ ఐరన్‌ ఉత్పత్తి చేశారు. మొత్తం 2 వేల టన్నులు. దీనిని స్టీల్‌గా మారిస్తే టన్నుకు రూ.50 వేల ధర వస్తుంది. అదే పూల్‌ ఐరన్‌ అయితే అందులో సగం కూడా రాదు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు పూల్‌ ఐరన్‌ ఎందుకు తయారుచేస్తున్నారో విచారణ చేసి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యల వల్లే ప్లాంటుకు నష్టాలు వస్తున్నాయని, ఇది యాజమాన్యం నిర్ణయమని, పూర్తిస్థాయి ఉత్పత్తికి ముడి పదార్థాలు అందుబాటులో లేని సమయంలో ఇలాంటి పూల్‌ ఐరన్‌ తయారు చేయడం నష్టదాయకమని, దీనిపై ఉక్కు మంత్రిత్వ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని నరసింగరావు కోరుతున్నారు.

19 వేల టన్నుల లక్ష్యం వల్లనే...

బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాలని యాజమాన్యం లక్ష్యం నిర్దేశించింది. ఆ మేరకు వాటి వద్ద కింద మీద పడి ఉత్పత్తి సాధిస్తున్నారు. దానిని ఎస్‌ఎంఎస్‌లో ప్రాసెస్‌ చేస్తేనే ఆ మేరకు స్టీల్‌ ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఎస్‌ఎంఎస్‌ విభాగంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అవి రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌ను ప్రాసెస్‌ చేయలేకపోతున్నాయి. దాంతో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల నుంచి వచ్చే హాట్‌మెటల్‌ను ‘పూల్‌ ఐరన్‌’గా మారుస్తున్నారు. లక్ష్యానికి తగినట్టు ఎస్‌ఎంఎస్‌ను సిద్ధం చేయకుండా బీఎఫ్‌లో 19 వేల టన్నులు తీయడం వల్ల ఈ నష్టం వస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. యాజమాన్యం రోజుకు 19 వేల టన్నులు ఉత్పత్తి తీస్తామని ఉక్కు మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చిందని, అలా చేస్తేనే నాలుగో క్వార్టర్‌కు నిధులు వస్తాయని, అందుకే ఇక్కడ పూల్‌ ఐరన్‌ ద్వారా నష్టాలు వస్తున్నా..బయటకు చెప్పడం లేదని అంటున్నారు. ఆర్థిక సాయం కోసం, ఇచ్చిన మాట కోసం నష్టాలు వచ్చే పరిస్థితిని యాజమాన్యమే కల్పిస్తోందని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - Dec 06 , 2025 | 01:06 AM