Share News

వంజంగి హిల్స్‌కు సొబగులు!

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:35 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. వంజంగి హిల్స్‌లో ‘కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం’ ప్రాజెక్టు కింద అవసరమైన అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

వంజంగి హిల్స్‌కు సొబగులు!
పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే వంజంగి కొండల్లో మంచు మేఘాలు

ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ చర్యలు

ఇప్పటికే తాటిమానులతో ప్రవేశ ద్వారం

ఇతర మౌలిక సదుపాయాలు,

అటవీ, పర్యావరణ రక్షణ చర్యలకు ప్రణాళిక

గిరిజనుల జీవనోపాదులు, అటవీ సంరక్షణకు ప్రాధాన్యం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలం వంజంగి అటవీ ప్రాంతం 208 హెక్టార్లలో రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఉండగా.. దానిలో 75 హెక్టార్ల పరిధిలో ఉన్న వంజంగి హిల్స్‌ వ్యూపాయింట్‌ ప్రదేశాన్ని ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకు గానూ తొలి విడతగా ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరు చేసింది. ఇన్నాళ్లు కొందరితో ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్వర్యంలో వంజంగి హిల్స్‌ అభివృద్ధికి నోచుకోకపోవడం, పర్యాటకుల నుంచి వసూలు చేసిన ప్రవేశ రుసుం ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వంజంగి హిల్స్‌లో కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ పూనుకోవడం విశేషం.

ఎకో టూరిజం ప్రాజెక్టు’గా గుర్తింపు

కనీస అభివృద్ధికి నోచుకోని వంజంగి హిల్స్‌ను అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్టుగా గుర్తించడంతో ఇకపై అక్కడ పర్యాటకాభివృద్ధి ఊపందుకోనుంది. అటవీ శాఖ ఆధీనంలో ఉండే ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తుందనే ట్రాక్‌ రికార్డు ఆ శాఖకు ఉంది. ఎకో టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించడంతో తొలుతగా ప్టాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రిస్తారు. అలాగే మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతారు. అలాగే సందర్శకుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుం సైతం పారదర్శకంగా ఉంటుంది. అలాగే స్థానిక గిరిజనులను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసి వారికి ఉపాధి కల్పిస్తారు. అలాగే గిరిజనుల జీవనోపాధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తారు. దీంతో పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా వంజంగి హిల్స్‌లో పర్యాటకాభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందని ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పటికే తాటిమానులతో రూపొందించిన ప్రవేశ ద్వారం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇప్పుడే మొదలైన టూరిజం ప్రాజెక్టు పనులు వచ్చే సీజన్‌ నాటికి సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 21 , 2025 | 11:35 PM