వందేమాతరం....
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:16 AM
జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం పది గంటలకు వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహికంగా గేయ ఆలాపన
విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం పది గంటలకు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే పది గంటలకు గేయం ఆలపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించగా కొన్నిచోట్ల తొమ్మిది గంటలకు రోజు వారీ జరిగే ప్రార్థనతో పాటు ముగించేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆఽధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు ఎస్‌డీ అనిత, పి.శేషశైలజ, మధుసూదన్, జిల్లా పర్యాటక శాఖ ఆర్డీ జీఎస్ కల్యాణి, జిల్లా పర్యాటకాధికారి జె.మాధవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతర గీతం స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను కలిగించిందన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి, వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆధ్వర్యంలో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, పీఆర్‌ఎస్‌ఈ శ్రీనివాస్, తదితరులు గేయం ఆలపించారు.