Share News

వందే భారత్‌ రైళ్ల నిర్వహణ ఇక్కడే...

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:17 AM

విశాఖపట్నంలో వందే భారత్‌ రైళ్ల మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి.

వందే భారత్‌ రైళ్ల నిర్వహణ ఇక్కడే...

  • మర్రిపాలెంలో రూ.300 కోట్లతో డిపో ఏర్పాటు

  • ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు

  • రాబోయే రోజుల్లో మరిన్ని వచ్చే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో వందే భారత్‌ రైళ్ల మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. మర్రిపాలెంలో రూ.300 కోట్లతో అవసరమైన పనులు చేపట్టనున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. భారతీయ రైల్వేలో అత్యధిక వేగంతో నడిచే రైళ్లలో వందేభారత్‌ మొదటి స్థానంలో ఉంది. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ కూడా అధికంగా ఉంది. వీటి సంఖ్య పెంచడానికి, కొత్త మార్గాల్లో వీటిని నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. చెన్నైలో వీటి నిర్మాణం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య రెండు అంటే...ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి ఏకకాలంలో నడుస్తున్నాయి. విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు మూడోది, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు నాలుగోది వెళుతున్నాయి. వీటిలో సికింద్రాబాద్‌లో మద్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకునే వందే భారత్‌ రైలుకు ఇక్కడ విశాఖలోని కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపోలోనే నిర్వహణ పనులు చేస్తున్నారు. మిగిలిన మూడు రైళ్లకు ఆయా ప్రాంతాల్లోనే నిర్వహణ పనులు జరుగుతున్నాయి. వీటికి స్పేర్‌ పార్ట్స్‌ (విడి భాగాలు) ఏమైనా అవసరమైతే చెన్నై నుంచి తెప్పించి బిగిస్తున్నారు.

ప్రత్యేక డిపో ఉండాల్సిందే

సాధారణ రైళ్లకు నిర్వహణ పనులు చేపట్టాలంటే కనీసం ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్‌ రైలుకు అయితే కనీసం 10 గంటలు అవసరం. దీనికి ప్రత్యేకమైన ‘పిట్‌ లైన్‌’ నిర్మిస్తారు. దానిపై రైలును నిలిపితే సిబ్బంది కిందన పిట్‌లైన్‌లోకి వెళ్లి మరమ్మతులు చేస్తారు. విశాఖపట్నం జోనల్‌ కేంద్రంగా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచి మరిన్ని వందేభారత్‌ రైళ్లు భవిష్యత్తులో నడిచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి తిరుపతికి ఒక రైలు త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్వహణ డిపో ఏర్పాటుచేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. మర్రిపాలెంలో అవసరమైన భూమి ఉన్నందున అక్కడ రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు ఉన్నతాధికారి తెలిపారు.

Updated Date - Oct 14 , 2025 | 01:17 AM