వల్లభాయ్ పటేల్ వంతెన రెడీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:06 AM
నేవల్ డాక్‌యార్డు సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయింది.
2 నుంచి రాకపోకలకు పోర్టు అధికారుల గ్రీన్‌సిగ్నల్
ప్రస్తుతానికి ఒక వైపు ప్రయాణానికి మాత్రమే వీలు
పారిశ్రామికప్రాంత వాసులకు ఊరట
మల్కాపురం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
నేవల్ డాక్‌యార్డు సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయింది. దీంతో అక్టోబరు రెండో తేదీ నుంచి వంతెనపై ప్రయాణానికి పోర్టు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్త వంతెన నిర్మాణానికి వీలుగా ఏడాదిన్నర కిందట మూసేశారు. సుమారు రూ.26 కోట్లతో పనులు చేపట్టారు.
వంతెన నిర్మాణాన్ని గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. సముద్రంపై ఆరుమీటర్ల ఎత్తున దీనిని నిర్మించారు. ఉప్పునీటి ప్రభావంతో వంతెన కింది భాగం తుప్పు పట్టకుండా ప్రత్యేక పెయింటింగ్స్ వేశారు. వంతెన కాలపరిమితి 60 ఏళ్లుగా నిర్ధారించారు. మద్రాస్ ఐఐటీ (ప్రాజెక్ట్స్ మోనటరింగ్ కమిటీ) పర్యవేక్షణలో పనులు సాగాయి. దీని డిజైన్‌ను కూడా వారే రూపొందించారు. వంతెన పొడవు 330 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు. ఇందులో ఏడు మీటర్లు వాహనాలు వెళ్లేందుకు, రెండువైపులా అడుగున్నర చొప్పున ఫుట్‌పాత్ నిర్మించారు. 33 మీటర్ల దూరాన్ని పరిమాణంగా తీసుకుని మొత్తం 10 పిల్లర్లు నిర్మించారు. వంతెనపై 15 విద్యుత్ దీపాలను ఏర్పాటుచేశారు.
ఒకవైపు మాత్రమే అనుమతి
ప్రస్తుతం వంతెనపై ఒకవైపు మాత్రమే అదీ తేలికపాటి వాహనాలకు అనుమతిస్తారు. పారిశ్రామిక ప్రాంతం నుంచి కాన్వెంట్ జంక్షన్ వైపు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. తిరిగి వచ్చేవారు కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ రోడ్డులో మారుతి సర్కిల్ నుంచి పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సాగరమాల పేరుతో హైవే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయినన తరువాత వంతెన పైనుంచి ఇరువైపులా రాకపోకలకు అనుమతిస్తారు.