ఊరూరా గ్రావెల్ దోపిడీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:04 AM
మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. రోజురోజుకు గ్రావెల్, మట్టి తవ్వకాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల అక్రమ తవ్వకందారులకు అధికారంలో వున్న కూటమి పార్టీలకు చెందిన కొంతమంది స్థానిక నేతలు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొండపోరంబోకు, బంజరు, అటవీ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు
అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు
కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్షాల నాయకులు కుమ్మక్కు
అక్రమ తవ్వకాలపై స్థానికుల ఫిర్యాదులు
పట్టించుకోని నియంత్రణ శాఖల అధికారులు
సబ్బవరం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. రోజురోజుకు గ్రావెల్, మట్టి తవ్వకాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల అక్రమ తవ్వకందారులకు అధికారంలో వున్న కూటమి పార్టీలకు చెందిన కొంతమంది స్థానిక నేతలు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాల నేతలు ఒక్కటై గ్రావెల్ దందా సాగిస్తున్నారు. పైడివాడ, పైడివాడఅగ్రహారం, గాలిభీమవరం ఎన్టీఆర్ కాలనీలను ఆనుకొని ఉన్న కొండలు, బంజరు భూముల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబతున్నారు. ఇంకా రాయపురఅగ్రహారం, ఒమ్మివానిపాలెంలోని బంజరు భూముల్లో కూడా గ్రావెల్, మట్టి తవ్వకాలుయథేచ్ఛగా సాగుతున్నాయి. ఒక్కడ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు లెక్కచేయడంలేదు. ఇక మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సూది కొండవాలు ప్రాంతంలో (సర్వే నంబరు 286) గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అమృతపురం సర్వే నంబరు 303లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ప్రజల అవసరాల కోసమే గ్రావెల్ తవ్వినట్టు అధికారులు, స్థానిక నేతలు చెబుతున్నారు. అరిపాక నుంచి నల్లరేగుపాలెం వెళ్లే రోడ్డుకు అనుకొనిఉన్న పోతు కొండ అటవీ భూముల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.