Share News

మళ్లీ యూరియా కష్టాలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:48 AM

మళ్లీ యూరియా కష్టాలు

మళ్లీ యూరియా కష్టాలు

ఫొటోరైటప్స్‌ః 16సీడీఎం1:

దుకాణాల వద్ద రైతుల పడిగాపులు, తోపులాట

పోలీసుల జోక్యంతో విక్రయాలు

అయినాసరే అందరికీ అందని నత్రజని ఎరువు

చివరి విడత యూరియా వేయడానికి సమయం మించిపోతుందని అన్నదాతల ఆందోళన

చోడవరం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు దశలో కూడా రైతులకు యూరియా కష్టాలు తొలగలేదు. వరిపైరు పొట్ట దశకు రావడంతో చివరి విడత యూరియా చల్లేందుకు ఎరువుల దుకాణాల బాటపట్టారు. వచ్చిన ఎరువుకన్నా అవసరం అధికంగా వుండడంతో రైతులు ఆందోళన చెందారు. షాపుల ముందు క్యూ కట్టారు. ఒక దశలో తోపులాట సైతం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన సమయంలో తగినంత యూరియా సరఫరా కాలేదు. దీంతో ప్రైవేటు దుకాణాలు, మన గ్రోమోర్‌ కేంద్రాలు, పీఏసీఎస్‌ల చుట్టూ రైతులు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చింది. యూరియా లోడు రాకముందే ఆయాచోట్ల బారులు తీరారు. ఎరువులను దుకాణంలోకి దించకుండా నేరుగా లారీ నుంచే రైతులకు పంపిణీ చేశారు. పొలాలను దమ్ము పట్టిన సమయంలో, వరినాట్లు వేసిన తరువాత యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి పొలానికి అవసరమైన సమయంలో యూరియా వేయలేకపోయామని అప్పట్లో పలువురు రైతులు వాపోయారు. కానీ అధికారుల వివరణ మరోలా వుంది. మిగిలిన ఎరువులతో పోలీస్తే యూరియా ధర తక్కువ కావడంతో రైతులు మోతాదుకు మించి వినియోగిస్తున్నారని, అందువల్లనే కొంతమందికి సకాలంలో అందలేని చెబుతున్నారు. కాగా ఇప్పుడు వరి పైరు పొట్ట దశకు చేరింది. చివరి విడత యూరియా వేయాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల బాటపట్టారు. గత అనుభవాలు పునరావృతం కాకుండా రైతులకు మూడో విడత సరిపడ యూరియాను ముందుగానే రప్పించడంలో అధికారులు విఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం చోడవరంలోని మన గ్రోమోర్‌ కేంద్రానికి 12 టన్నుల యూరియా వచ్చినట్టు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు వచ్చి బారులు తీరారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి రైతులను క్యూలో నిల్చోబెట్టి యూరియా విక్రయాలు నిర్వహించారు. చోడవరంతోపాటు బుచ్చెయ్యపేట, చీడికాడ, కె.కోటపాడు మండలాల నుంచి కూడా రైతులు ఇక్కడకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వచ్చే వారం అన్ని దుకాణాలకు యూరియా వచ్చే అవకాశం ఉందని, అంతవరకు ఓపిక పట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

Updated Date - Oct 17 , 2025 | 12:49 AM