ఆహ్లాదాన్ని పంచే నగర వనాలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:27 PM
పట్టణ ప్రాంత ప్రజలకు అహ్లాదకరమైన పచ్చని వాతావరణం అందించడానికి నగర వనాలు అందుబాటులోకి రాబోతున్నాయి.
నర్సీపట్నం ఆరిలోవ ధన్వంతరి వనంలో, ఎలమంచిలి నియోజకవర్గం యర్రవరం వద్ద వేమగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు
తొలి విడతగా ఒక్కొక్కదానికి రూ.1.15 కోట్లు మంజూరు
పరిపాలనా అనుమతులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం
పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే అటవీ శాఖ లక్ష్యం
వాకింగ్ పాత్, చెక్క వంతెన, ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు
నర్సీపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంత ప్రజలకు అహ్లాదకరమైన పచ్చని వాతావరణం అందించడానికి నగర వనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. జిల్లాలో కశింకోట మండలం బయ్యవరంలో జాతీయ రహదారిని ఆనుకొని శారదా వనం పేరుతో నగర వనం ఏర్పాటు చేశారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వం నగర వనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తాజాగా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఆరిలోవ ఆటవీ ప్రాంతంలోని ధన్వంతరి వనం ఒకటి, ఎలమంచిలి నియోజకవర్గం యర్రవరం వద్ద వేమగిరి అటవీ ప్రాంతంలో నగర వనాలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఒక్కొక్క నగర వనం ఏర్పాటు చేయడానికి రూ.2 కోట్లు చొప్పున ఖర్చు అవుతుందని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. మొదటి విడతగా రూ.1.15 కోట్లు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. పట్టణ ప్రాంత ప్రజలు సేద తీరేందుకు ఆహ్లాదకరమైన సుందర హరిత వనాలను ఏర్పాటు చేసి, పర్యావరణంపై అవగాహన పెంచడానికి నగర వనాలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాలకు దగ్గరలో అటవీ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాలకు దగ్గరలో ఉన్న అరిలోవ, వేమగిరి అటవీ ప్రాంతాలను ఎంపిక చేశారు.
నగర వనాల్లో ఏముంటాయంటే..
నగర వనాలలో కొండ పైకి ట్రెక్కింగ్‌కి వెళ్లేందుకు ఏర్పాటు చేస్తారు, పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఏర్పాటు చేస్తారు. వాకింగ్ ట్రాక్, యోగ, ధ్యాన మందిరాలు, క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. చెక్కతో పగోడాలు నిర్మిస్తారు. చెక్క భవంతిని నిర్మించి అటవీ సిబ్బందితో పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తారు. సేద తీరేందుకు చెక్క బెంచీలు, తాగునీరు, కుర్చీలు సమకూర్చుతారు. ఆరిలోవ అటవీ ప్రాంతంలో మూడు పగోడాలు, ఉడెన్ పాత్ (చెక్క వంతెన), ట్రెక్కింగ్‌కి ఏర్పాటు చేస్తున్నామని నర్సీపట్నం రేంజ్ అధికారి కేవీ రాజేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.