పెందుర్తిలో ఆగని భూ ఆక్రమణలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:52 AM
పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెరపడడం లేదు.
చెరువులనూ వదలని కబ్జాదారులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెరపడడం లేదు. కూటమిలో ఒక పార్టీకి చెందిన నేతలు, ఒకరిద్దరు కార్పొరేటర్లు, వారి బంధువులు ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారు. కొన్నిచోట్ల కూటమి నేతలే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఓ కార్పొరేటర్ బంధువు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కల్యాణ మండపం నిర్మించి, కోర్టు నుంచి స్టే పొందారు. ఇళ్లు లేని పేదల పక్షాన ఉంటున్నామని మరికొందరు నాయకులు ఏకంగా చెరువులనే ఆక్రమించుకున్నారు.
చినముషిడివాడ సమీపంలోని సర్వే నంబరు 113లో ప్రభుత్వ బంజరును ఆక్రమించుకుని కల్యాణమండపం నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ తొలుత పూర్తిగా నిద్రపోయింది. ఆ తరువాత నోటీస్ ఇస్తే సదరు ఆక్రమణదారుడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దానిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలానికి ఇటీవల మరొకరు ప్రహరీగోడ నిర్మించారు. అప్పటివరకూ మౌనంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది ఆ తరువాత అడ్డుకోగా 1980లో అప్పటి కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని చూపిస్తున్నారు. ఆ స్థలం ఇప్పటికీ రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగానే ఉంది. కాగా పెందుర్తిలో కొన్ని చెరువులను ఆక్రమించుకుని పలువురు ఇళ్లు నిర్మించుకోగా, సుజాతనగర్ టీచర్స్ లేఅవుట్‌లో గెడ్డలు, వాగులు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. చినముషిడివాడ చెరువులో ఆక్రమణ తొలగింపునకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. పెందుర్తి మండలంలో ఆక్రమణల తొలగింపునకు పోలీసుల నుంచి సహకారం అందడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి కూటమి నేతల ఒత్తిడే కారణమని చెబుతున్నారు.
ఆటోడ్రైవర్ సేవలోకు స్పందన
30 వేలకు పైగా దరఖాస్తులు
1,850 అప్లికేషన్లపై అభ్యంతరాలు
నివృత్తి చేసిన రవాణాశాఖ అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ఆటో, క్యాబ్ వాహన యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలుచేయనున్న ఆటో డ్రైవర్ సేవలో (వాహనమిత్ర) పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 30 వేలకు పైగా దరఖాస్తులు అందినట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. సొంతంగా ఆటో, మ్యాక్సీ క్యాబ్ కలిగిన వారికి చేయూతనిచ్చేందుకు వీలుగా ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆటో, క్యాబ్ యజమానులకు దసరా రోజున పథకం కింద డబ్బు జమ చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా అర్హులైనవారంతా ఈనెల 17 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులు కలెక్టరేట్‌లోని వార్డు సచివాలయ పర్యవేక్షణ విభాగానికి చేరుతాయి. వాటిలో అభ్యంతరాలుంటే రవాణాశాఖ అధికారుల పరిశీలనకు పంపిస్తారు. ఈ మేరకు 1,850 దరఖాస్తులు రవాణాశాఖ అధికారుల లాగిన్‌కు వెళ్లాయి. వారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కలెక్టరేట్‌లోని అధికారుల వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ తిరిగి పంపారు. వాహనమిత్ర పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 30వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనావేస్తున్నారు. సోమవారం నాటికి ఈ సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.