Share News

పాడేరులో కానరాని పర్యాటకులు!

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:27 PM

పాడేరు-విశాఖపట్నం మెయిన్‌ రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఈ ఏడాది మన్యానికి పర్యాటకుల రాక తగ్గింది. గతంలో దీపావళి తర్వాత సందర్శకుల రాకతో ఏజెన్సీ సందడిగా ఉండేది. కాని ఈ ఏడాది పర్యాటక సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు కావస్తున్నప్పటికీ సందర్శకుల సందడి కానరావడం లేదు.

పాడేరులో కానరాని పర్యాటకులు!
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో కోడూరుకు సమీపంలో గోతులు

బీఎన్‌ రోడ్డు గోతులతో తగ్గిన సందర్శకుల రాక

రోడ్డుపై గోతులతో వాహనాలు చెడిపోవడం,

ఒళ్లు హునం కావడమే కారణం

పాడేరు-విశాఖపట్నం మెయిన్‌ రోడ్డు

దుస్థితిపై పర్యాటకులు పెదవివిరుపు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

పాడేరు ఘాట్‌, కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, కొత్తపల్లి జలపాతం, మత్స్యగుండం ప్రాంతాలను తిలకించే వారంతా విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి చోడవరం, వడ్డాది మీదుగా పాడేరు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ రోడ్డు వి.మాడుగుల, చోడవరం మండలాల పరిధిలో గతుకులమయమై అత్యంత అధ్వానంగా ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటే జనంతో పాటు పర్యాటకులు సైతం బెంబేలెత్తుతున్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డును కనీసం పట్టించుకోపోగా...కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా దీనికి మోక్షం కలగకపోవడం గమనార్హం. ఏజెన్సీలో రోడ్లతో పాటు పాడేరు నుంచి ఘాట్‌ దిగే వరకు అంటే...వి.మాడుగుల మండలం తాటిపర్తి వరకు ఎటువంటి గతుకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాని అక్కడి నుంచి వి.మాడుగుల మండలం పరిధిలోకి వచ్చే తాటిపర్తి, కాశీపురం, కోడూరు, ఎంకే వల్లాపురం, ఎం.కోటపాడు, సాగరం జంక్షన్‌, వడ్డాది, విజయరామరాజుపేట, గౌరీపట్నం జంక్షన్‌, చోడవరం, గోవాడ, వెంకన్నపాలెం జంక్షన్‌ వరకు రోడ్డు గతుకులమయంగానే ఉంది. దీంతో ప్రయాణ సమయం రెట్టింపు కావడం, వాహనాలు పాడైపోవడం, ప్రయాణికులకు ఒళ్లు నొప్పులు తప్పడం లేదు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని అరకులోయ మీదుగా పాడేరు ప్రాంతానికి చేరుకోవాలంటే 60 కిలోమీటర్లు ఎక్కువ దూరంతో పాటు సమయం వృథా అవుతుండడంతో సందర్శకులు మన్యానికి వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. దీంతో మన్యంలో పర్యాటక సందడి తగ్గింది.

రైడింగ్‌ ఆసక్తితోనే పర్యాటక ప్రదేశాల సందర్శన

అధిక సంఖ్యలో పర్యాటకులు యువకులే. దీంతో వారంతా కారు లేదా బైక్‌ రైడింగ్‌పై ఆసక్తితోనే పలువురు ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలకు వస్తుంటారు. సదూర ప్రాంతాలకు వాహనాలపై వెళ్లేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ఈక్రమంలో రోడ్లు బాగుండడం ఎంతో ముఖ్యంగా భావిస్తారు. కాని వారి ఆలోచనలకు భిన్నంగా మెయిన్‌రోడ్డు అధ్వానంగా ఉండడంతో రైడింగ్‌ ఎంజాయ్‌ చేయకపోగా ప్రమాదాలకు గురవుతామనే భయంతో ఎక్కువ మంది యువకులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చోడవరం, వి.మాడుగుల మండలాల పరిధిలోని అధ్వానంగా రోడ్డును బాగుచేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:27 PM