నదుల్లో తగ్గని వరద
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:54 AM
తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు, గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి శారదా, పెద్దేరు నదుల్లో వరద ఉధృతి అధికంగా వుంది. శారదా నది ఒడ్డున ఉన్న భోగాపురంలో రైతులు పంటపొలాల్లోని కల్లాల నుంచి పశువులను ఇళ్లకు తరలించారు. జన్నవరం వద్ద పెద్దేరు నది వంతెనను తాకుతూ ప్రవహింస్తున్నది. వంతెన కింద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండిపోవడంతో వరద ప్రవాహం వంతెన పైకి వస్తుందేమోనని ఆందోళన చెందారు.
పలు గ్రామాల్లో రెండో రోజూ ముంపులోనే వరి పొలాలు
ధాన్యం దిగుబడిపై రైతుల్లో సన్నగిల్లుతున్న ఆశలు
చోడవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు, గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి శారదా, పెద్దేరు నదుల్లో వరద ఉధృతి అధికంగా వుంది. శారదా నది ఒడ్డున ఉన్న భోగాపురంలో రైతులు పంటపొలాల్లోని కల్లాల నుంచి పశువులను ఇళ్లకు తరలించారు. జన్నవరం వద్ద పెద్దేరు నది వంతెనను తాకుతూ ప్రవహింస్తున్నది. వంతెన కింద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండిపోవడంతో వరద ప్రవాహం వంతెన పైకి వస్తుందేమోనని ఆందోళన చెందారు. అధికారులు ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చి వంతెన కింద చిక్కుకున్న చెట్ల కొమ్మలను తొలగించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా వర్షాలకుతోడు నదుల్లో వరద ప్రవాహం అధికంగా వుండడంతో జన్నవరం, చాకిపల్లి, కన్నంపాలెం, సింహాద్రిపురం, అంకుపాలెం గ్రామాల్లో వరి, చెరకు తోటలు, ఇతర పంటలు నీట మునిగి చెరువులను తలపించాయి. లక్ష్మీపురం చెరువు నిండి, అలుగు పారడంతో నరసయ్యపేట, లక్ష్మీపురం కల్లాల వద్ద వరి పొలాలు నీటమునిగాయి. ఇప్పటికే రెండు రోజుల పాటు నీటమునిగిన వరి పొలాలు మూడో రోజు కూడా ముంపులోనే ఉండిపోతే ధాన్యం దిగుబడి కష్టమేనని రైతులు వాపోతున్నారు.