Share News

వీడని ఉత్కంఠ

ABN , Publish Date - May 18 , 2025 | 12:33 AM

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

వీడని ఉత్కంఠ

డిప్యూటీ మేయర్‌ పదవి కోసం టీడీపీలో ముగ్గురు మధ్య పోటీ

తమకు ఇవ్వాల్సిందేనని జనసేన పట్టు... పరిశీలనలో ఇద్దరు పేర్లు

నేడు మేయర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ

డిప్యూటీ మేయర్‌ పేరును ఖరారు చేసే అవకాశం

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారమే కొత్త డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనున్నందున ఆశావహుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. ఒకవైపు డిప్యూటీ మేయర్‌ పదవి తమదేనని ధీమాతో వున్న టీడీపీ ఆశావహులకు తాజాగా జనసేన కూడా తమకు డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తుండడంతో రెండు పార్టీల ప్రజాప్రతినిధులను మరింత ఇరకాటంలో పెట్టినట్టయింది. టీడీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు, జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఈ పోస్టు కోసం తీవ్రంగా పోటీపడడుతుండడంతో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, మేయర్‌ ఆదివారం భేటీ అయి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు గతనెల 26న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత ఈ పదవి కోసం టీడీపీకి చెందిన ఐదో వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని మంగవేణి, 76వ వార్డు కార్పొరేటర్‌ గంఽధం శ్రీనివాసరావు పోటీపడుతున్నారు. వైసీపీ హయాంలో మేయర్‌గా పనిచేసిన గొలగాని హరివెంకటకుమారిని పదవి నుంచి తొలగించి, వేరొక సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావుకు మేయర్‌ పదవిని అప్పగించినందున, డిప్యూటీ మేయర్‌ పోస్టును యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వడం ద్వారా తమ సామాజిక వర్గంలో టీడీపీ పట్ల అసంతృప్తి రాకుండా చూడాలంటూ ఆ వర్గానికి చెందిన కార్పొరేటర్లు కోరుతున్నారు. ఆ కోణంలో పరిశీలిస్తే తమకు అవకాశం ఇవ్వాలని 18వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని మంగవేణి ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు తూర్పు నియోజకవర్గానికి వీఎంఆర్డీఏ ఛైర్మెన్‌ పదవిని ఇవ్వగా, గాజువాక నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు చెందిన కోన తాతారావుకు డీసీసీబీ చైర్మన్‌ పదివిని ఇచ్చినందున భీమిలి నియోజకవర్గానికి న్యాయం చేయాల్సి ఉంది కాబట్టి, యాదవ మహిళనైన తనకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పించాలని మొల్లి హేమలత విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపుు డిప్యూటీ మేయర్‌ పదవి నుంచి తొలగించిన జియ్యాని శ్రీధర్‌ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ వర్గానికి తిరిగి ప్రాధాన్యం కల్పించేలా రెండుసార్లు కౌన్సిలర్‌, రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని 76వ వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు కోరుతున్నారు. ఇలా వీరంతా ఎవరికివారు తమకు అస్మదీయులైన ప్రజాప్రతినిధుల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం రాత్రి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు మేయర్‌ కలిసి ఒక హోటల్‌లో సమావేశమై డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. జనసేన పార్టీకి ఆగస్టులో ఖాళీ అయ్యే రెండో డిప్యూటీ మేయర్‌ పదవిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీ నుంచి డిప్యూటీ మేయర్‌ పదవికి ఎవరూ పోటీలో లేనట్టేనని అంతా భావించారు. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డిప్యూటీ మేయర్‌ పదవిని తమకే కేటాయించేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కోరుతూ పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ ద్వారా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు శుక్రవారం ఇద్దరు కార్పొరేటర్ల పేర్లతో కూడిన లేఖను పంపించారు. ఇప్పటికే ముగ్గురిలో ఎవరి పేరు ఖరారు చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు జనసేన రూపంలో మరొక చిక్కుముడి వచ్చిపడినట్టయింది. దీంతో డిప్యూటీ మేయర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలావుండగా టీడీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి వద్ద డిప్యూటీ మేయర్‌ ఎవరనే విషయాన్ని ప్రస్తావించగా... యాదవ మహిళను మేయర్‌ పదవి నుంచి తొలగించినందున ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళను డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేయకపోతే పార్టీకి ఆ వర్గం నుంచి వ్యతిరేకత వచే ్చ అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలిని డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేయాలని మెజారిటీ కూటమి ప్రజాప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారని ఆయనన్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున ఆ సామాజిక వర్గానికి ఫ్లోర్‌ లీడర్‌ పదవిని అప్పగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనసేన పార్టీని కూడా సంతృప్తిపరిచేందుకు వీలుగా రెండో డిప్యూటీ మేయర్‌ పదవిని దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్పొరేటర్‌కు ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. దీనివల్ల అన్ని వర్గాలు, పార్టీలను సంతృప్తిపరిచినట్టవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఆదివారం రాత్రికి డిప్యూటీ మేయర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

Updated Date - May 18 , 2025 | 12:33 AM