Share News

పడకేసిన ఉపాధి పనులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:37 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిబిల్లులను అప్‌లోడ్‌ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులు ఆపేశారు. పాత బిల్లులు అందేవరకు కొత్తగా పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడంలేదని తెలిసింది.

పడకేసిన ఉపాధి పనులు
రావికమతంలో ఉపాధి నిధులతో వేసిన సిమెంట్‌ రోడ్డు

కన్వర్జన్సీ పనులకు ఐదు నెలలుగా అందని బిల్లులు

సీసీ, బీటీ రోడ్లకు రూ.70 కోట్లు బకాయిలు

మిగిలిన పనులు చేయలేమంటూ చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిబిల్లులను అప్‌లోడ్‌ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులు ఆపేశారు. పాత బిల్లులు అందేవరకు కొత్తగా పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడంలేదని తెలిసింది.

జిల్లాలో 2025-26 సంవత్సరానికిగాను ఉపాధి హామీ కన్వర్జెన్సీ కింద పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా గ్రామాల్లో 1,296 పనులకు రూ.73.25 కోట్లు కేటాయించారు. కూటమి అధికారంలో వుండడంతో బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి పెద్దఎత్తున సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌నాటికి సుమారు రూ.65 కోట్ల విలువ చేసే రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. కొద్ది రోజులకే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. సుమారు ఐదు నెలలు గడిచినప్పటికీ నిధులు విడుదల కాలేదు. పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా చేపట్టిన సీసీ, బీటీ రోడ్లకు సంబంధించి పూర్తయిన పనులకు రూ.55 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. నిధుల విడుదలపై అధికారులు నాలుగు నెలల నుంచి ఇదిగో.. అదిగో.. అంటున్నారే తప్ప కాంట్రాక్టర్ల ఖాతాల్లో డబ్బులు మాత్రం జమ కావడం లేదు. కొంతమంది కాంట్రాక్టర్లకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయలకుపైగా బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు అప్పులు తెచ్చిన కాంట్రాక్టర్లు.. వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగమే కాకుండా సమగ్ర శిక్ష, అటవీ శాఖ, సెరీకల్చర్‌, పశుసంవర్థక శాఖల్లో ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ కింద చేసిన పనులకు సైతం బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆయా శాఖల్లో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి నెలకొంది.

మారని తీరు..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి చెల్లింపులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో జరిగేవి. దీనివల్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవడంతో పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొత్త ఖాతాల ద్వారా నగదు చెల్లించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలను ఒకే ఖాతా కిందకు తీసుకొచ్చింది. పోర్టల్‌లో నమోదు చేసి వరుస క్రమంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపటింది. కానీ పరిస్థితుల్లో మార్పులు రాలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం వంటి కారణాలతో సకాలంలో బిల్లులు చెల్లించని పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుల పెండింగ్‌పై పీఆర్‌ ఈఈ ప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేశామని, మరో వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం వుందన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:38 AM