Share News

ఆనవాళ్లు లేని ఆర్‌ఈసీ రోడ్డు

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:46 AM

మండల కేంద్రం రావికమతం నుంచి తట్టబంద, తోటకూరపాలెం మీదుగా కశింకోట మండలం ఈశ్వరకన్నూరుపాలెం (ఆర్‌ఈపీ) వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు దుస్థితి వర్ణానాతీతం. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై రావికమతం, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు.

ఆనవాళ్లు లేని ఆర్‌ఈసీ రోడ్డు
రావికమతం మండలం దాసరయ్యపాలెం వద్ద గోతులమయమైన రోడ్డు

రావికమతం నుంచి తోటకూరపాలెం వరకు పూర్తిగా ఛిద్రం

గోతుల్లో కూరుకుపోతున్న వాహనాలు

తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్‌

ప్రయాణికులకు రోజూ కష్టాలే

రావికమత ం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం రావికమతం నుంచి తట్టబంద, తోటకూరపాలెం మీదుగా కశింకోట మండలం ఈశ్వరకన్నూరుపాలెం (ఆర్‌ఈపీ) వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు దుస్థితి వర్ణానాతీతం. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై రావికమతం, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. రెండు దశాబ్దాల క్రితం వరకు మెటల్‌ రోడ్డుగా వున్న ఈ రహదారిని తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. పంచాయతీరాజ్‌ శాఖకు నిర్వహణ భారంగా మారడంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకువచ్చారు. కానీ ఒక్కఏడాది కూడా మరమ్మతు, నిర్వహణ పనులు చేసిన పాపాన పోలేదు. గ్రానైట్‌ బండరాళ్లు, సరుగుడు లోడు లారీలు, క్వారీ టిప్పర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుండడంతో తీవ్రంగా దెబ్బతిన్నంది. కొన్నిచోట్ల తారు రోడ్డు ఆనవాళ్లు లేనంతగా ధ్వంసమైంది. ముఖ్యంగా రావికమతం సమీపంలోని దాసరయ్యపాలెం నుంచి తోటకూరపాలెం వరకు భారీ గోతులు ఏర్పడ్డాయి. వాహనాలు తరచూ వీటిల్లో కూరుకుపోయి ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది. ఈ రోడ్డులో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌ఈసీ రోడ్డు దుస్థితిపై ఆర్‌అండ్‌బీ మాడుగుల సెక్షన్‌ జేఈ సాయిశ్రీనివాస్‌ను వివరణ కోరగా... ఈ రోడ్డు అభివృద్ధికి రూ.3 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - Nov 22 , 2025 | 12:46 AM