కార్యరూపం దాల్చని వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:30 AM
అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ది సంస్థ (వీఎంఆర్‌డీఏ)...వాటిని అమలు చేసే విషయంలో వెనుకబడుతోంది.
రుషికొండలో వాటర్ స్పోర్ట్స్,
మధురవాడలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు
ఏడాది కిందట బోర్డు నిర్ణయం
కాగితాలకే పరిమితం
ముందుకుసాగని పనులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ది సంస్థ (వీఎంఆర్‌డీఏ)...వాటిని అమలు చేసే విషయంలో వెనుకబడుతోంది. రుషికొండలో వాటర్ స్పోర్ట్స్, మధురవాడలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. మధురవాడలోని 2.78 ఎకరాల్లో పీపీపీ విధానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించారు. సర్వే నంబరు 147/పిలో స్థలం గుర్తించారు. అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఎరీనా నిర్మించాలని ప్రతిపాదించారు. దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇకపోతే రుషికొండ బీచ్, గంభీరం రిజర్వాయర్ వద్ద యువత కోసం వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. రుషికొండ బీచ్‌ను ఆనుకొని ఉన్న స్థలంలో స్పీడ్ బోట్లు, కయాకింగ్ వంటివి అందుబాటులోకి తెస్తామన్నారు. ఇది కూడా పీపీపీలో చేపడతామని టెండర్లు ఆహ్వానించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి చేపట్టాలని ముందడుగు వేశారు. రెండు సంస్థలు 50:50 ఖర్చు భరించాలని అవగాహనకు వచ్చాయి. ఒక్కొక్కరు రూ.1.68 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రణాళిక రూపొందించారు. ఆదాయాన్ని ఎలా పంచుకోవాలనే దానిపై కూడా చర్చించారు. స్థానికంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి పర్యవేక్షణ అప్పగించాలని అనుకున్నారు. అవన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. పనుల్లో ప్రగతి లేదు. ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో కూడా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అది జల వనరుల శాఖకు చెందినది కాబట్టి వారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా వారికి లేఖలు కూడా రాయలేదని విశ్వసనీయంగా తెలిసింది.