Share News

ఫుడ్‌ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:30 AM

బీచ్‌లో ప్రారంభించిన ఫుడ్‌ ఫెస్టివల్‌కు ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చిందని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

ఫుడ్‌ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన

ఓపెన్‌ పాలసీల ద్వారా మరింత అభివృద్ధి చెందనున్న పర్యాటక రంగం

విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం: పర్యాటక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌లో ప్రారంభించిన ఫుడ్‌ ఫెస్టివల్‌కు ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చిందని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక ఖాళీ స్థలంలో వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఫుడ్‌ ఫెస్టివల్‌ పెడితే ఆదరణ లభిస్తుందా?..అని అదికారులు ముందు తటపటాయించారని, తానే ధైర్యం చెప్పి విజయవంతం అవుతుందని భుజం తట్టానన్నారు. అయితే అంతకు మించి ప్రజలు రావడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని, ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. పర్యాటక రంగం ఓపెన్‌ పాలసీల ద్వారా అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యాటక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ, విశాఖపట్నం అంటేనే పర్యాటకం అని, అందుకే సీఎం చంద్రబాబు ఈ నగరానికి అంత ప్రాముఖ్యం ఇస్తారన్నారు. విశాఖలో కొత్త హోటళ్లు, రిసార్ట్స్‌ వస్తాయన్నారు. విశాఖ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే భాగస్వామ్య సదస్సు, విశాఖ ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌లు ఉంటాయన్నారు.

ప్రతి నెలా ఒక ఈవెంట్‌

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

ఇకపై విశాఖపట్నంలో ప్రతి నెలా ఒక ఈవెంట్‌ నిర్వహిస్తామని, జనవరిలో వైజాగ్‌, భీమిలి ఉత్సవ్‌లు ఉంటాయని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఆర్‌ జరుగుతుందని, సిటీ పరేడ్‌ ఉంటాయన్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్సులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఆ తరువాత స్టార్‌ హోటళ్ల చెఫ్‌లకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందించారు. పర్యాటక శాఖ, హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు జె.మాధవి, ఆర్‌డీ జగదీశ్‌, ఏపీ టూరిజం ఫోరం ప్రతినిధులు విజయమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 01:30 AM