Share News

కానరాని మావోయిస్టుల బంద్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:15 PM

మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ జీకేవీధి మండలం సీలేరులో కానరాలేదు.

కానరాని మావోయిస్టుల బంద్‌
కొయ్యూరులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ

విస్తృతంగా కొనసాగిన వాహన తనిఖీలు

యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు

తిరిగిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు

మన్యంలో జరిగిన సంతలు

సీలేరు నైట్‌ సర్వీసులు రద్దు

సీలేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ జీకేవీధి మండలం సీలేరులో కానరాలేదు. మారెడిమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ జరపాలంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ఆదివారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఏవోబీలో ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చునని సరిహద్దు ప్రాంతాల గిరిజనులు భయపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సరిహద్దు ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం ఎక్కడా కానరాలేదు. సీలేరు, ధారకొండ ప్రాంతాల్లో వారపు సంతలు జరిగాయి. సీలేరు మీదుగా తిరిగే నైట్‌ సర్వీస్‌లు రద్దు మినహా ఇతర కార్యకలాపాలు యఽథావిధిగా కొనసాగాయి. బంద్‌ ప్రశాంతంగా ముగియడంతో ప్రాంతీయులు ఊపిరిపీల్చుకున్నారు.

కొయ్యూరులో..

మావోయిస్టుల భారత్‌ బంద్‌కు మండలంలో స్పందన కరవైంది. మారుమూల ప్రాంతాలైన మంప, బూదరాళ్ల, దాకోడు, శరభన్నపాలెం, బొర్రంపేట తదితర గ్రామాలకు ఆర్‌టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు యథావిధిగా తిరిగాయి. ఆదివారం రాజేంద్రపాలెంలో వారపు సంత పూర్తిస్థాయిలో జరిగింది. వ్యాపార సంస్థలు పనిచేశాయి. బంద్‌ను పురస్కరించి ప్రధాన కూడళ్లలో కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, కొయ్యూరు, మంప ఎస్‌ఐలు కిషోర్‌వర్మ, శంకరరావుల ఆధ్వర్యంలో సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచిపెట్టారు.

జి.మాడుగులలో..

మావోయిస్టుల బంద్‌ మండలంలోని కానరాలేదు. మండల కేంద్రం మొదలుకొని నుర్మతి, మద్దిగరువు, బందవీధి, తదితర ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరిగాయి. ప్రైవేటు వాహనాల రాకపోకలు సాగాయి.

గూడెంకొత్తవీధిలో..

మండలంలో మావోయిస్టుల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సీపీఐ మావోయిస్టులు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఆదివారం బంద్‌కి పిలుపునిచ్చారు. మావోయిస్టుల బంద్‌ నేపఽథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా మండలంలో మావోయిస్టు బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి.

Updated Date - Nov 30 , 2025 | 11:15 PM