మోడల్ స్కూల్‌లో అనూహ్యంగా ప్రవేశాలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:49 AM
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
పిండ్రంగి పాఠశాలలో గత ఏడాది 32 మంది విద్యార్థులు
ఈ ఏడాది కొత్తగా 35 మంది చేరిక
వీరిలో 23 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి రాక
62కు చేరిన విద్యార్థుల సంఖ్య
కె.కోటపాడు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో చదివిన పలువురు విద్యార్థులు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు కె.కోటపాడు మండలంలోని పిండ్రంగి మోడల్ ప్రాథమిక పాఠశాల ఒక ఉదాహరణ. గత ఏడాది ప్రాథమిక పాఠశాలగా ఉన్న ఈ స్కూల్లో 32 మంది విద్యార్థులు వుండగా, ఈ ఏడాది ఇంతవరకు 62 మంది విద్యార్థులు వున్నారు. మొత్తం మీద కొత్తగా 35 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. ఈ సందర్భంగా ఎంఈఓ-1 కె.సత్యనారాయణ, ఎంఈఓ -2 డీవీడీ ప్రసాద్ సోమవారం పాఠశాలలో మీడియాతో మాట్లాడుతూ, పిండ్రంగి ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది ఒకటో తరగతిలో 14 మంది, రెండో తరగతిలో 8, మూడో తరగతిలో 5, నాలుగో తరగతిలో ఐదుగురితో కలిపి మొత్తం 32 మంది విద్యార్థులు వున్నట్టు చెప్పారు. గత ఏడాది ఐదో తరగతిలో ఒక్కరు కూడా లేరని తెలిపారు. నాలుగు నుంచి ఐదో తరగతికి వచ్చిన ఐదుగురు విద్యార్థులు ఈ ఏడాది రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరారని, మొత్తం మీద గత ఏడాది చదివిన వారిలో 27 మంది ఈ ఏడాది కూడా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఇక కొత్తగా ఒకటో తరగతిలో 16 మంది,. రెండో తరగతిలో ఆరుగురు, మూడో తరగతిలో ఆరుగురు, నాలుగో తరగతిలో ఏడుగురు చేరినట్టు చెప్పారు. ఒకటో తరగతిలో చేరిన వారిలో 12 మంది అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వచ్చారని, మిగిలిన వారంతా ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చి చేరారని వారు పేర్కొన్నారు. పాత విద్యార్థులు 27 మంది, కొత్త విద్యార్థులు 35 మంది కలిపి ప్రస్తుతం మొత్తం 62 మంది విద్యార్థులు వున్నారని, వీరికి పాఠాలు బోధించడానికి హెచ్‌ఎంతో కలిపి నలుగురు టీచర్లు వున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు గ్రామంలో చదువుకునే పిల్లలు వున్న ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, వసతులు, ప్రభుత్వ పథకాల వివరించి తల్లిదండ్రులకు వివరించడంతో సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఉపాధ్యాయుల కృషితోపాటు సర్పంచ్ జె.రామలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు ఎన్.గోపి, ఎస్‌ఎంసీ చైర్మన్ బాదిరెడ్డి దేవి, గ్రామస్థుల సహకారంతో మోడల్ స్కూల్‌లో అనూహ్యంగా ప్రవేశాలు పెరిగాయని ఎంఈవోలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు సోమవారం పాఠశాలను సందర్శించి హెచ్‌ఎం బి.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు కె.బంగారునాయుడు, పోతల నాయుడుబాబు, పి.రమేశ్‌తోపాటు ఎస్‌ఎంసీ చైర్మన్‌ను అభినందించారు.
‘ప్రైవేటు’ నుంచి సుభద్రయ్యపాలెం పాఠశాలలో ఏడుగురు చేరిక
మాకవరపాలెం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని సుభద్రయ్యపాలెం పాఠశాలలో ఒకే రోజు ఏడుగురు విద్యార్థులు చేరారు. వీరంతా గత ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారు కావడం గమనార్హం. వాస్తవంగా పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి ఈ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేదు. దీనిపై ఈ నెల 19వ తేదీన ‘ప్రభుత్వ బడులు వెలవెల’ శీర్షిన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మండల విద్యా శాఖాధికారులు జూన్ ప్రసాద్, ఎంవీఎస్ మూర్తి సోమవారం సర్పంచ్ (జి.వెంకటాపురం) మేరీ, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు, ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. వీరిలో కూండ్రపు నేహశ్రీ, బండారు సందీప్, పైల దేవిశ్రీ మూడో తరగతిలో చేరగా, బండారు దివ్య, పైల నూకసూర్యదినేశ్, రెడ్డి గంగాభార్గవ్, బంగారు రేష్మిక ఒకటో తరగతిలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.